త్వరలో వైకాపాలో మరో వికెట్ పడబోతోంది. అయితే ఈసారి సదరు ఎమ్మెల్యే కానీ తెదేపా గానీ ఆ సంగతి ప్రకటించలేదు. ఆ విషయం వేరే విధంగా బయటపడటం విశేషం. సదరు ఎమ్మెల్యే రాకను వ్యతిరేకిస్తూ ఆ నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు చేసిన హడావుడి మూలంగా వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే తెదేపాలో చేరబోతున్న సంగతి బయటపడింది. ఇంతకీ ఎవరా వైకాపా ఎమ్మెల్యే..అతనిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే..ఆయన ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ఆయన చేరికను గిద్దలూరు నియోజకవర్గ తెదేపా ఇన్-చార్జ్ అన్నే రాంబాబు వ్యతిరేకిస్తున్నారు.
ఆయన తన అనుచరులను విజయవాడకి పంపించి వారి ద్వారా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి తన అభ్యంతరాలు తెలియజేసారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలందరూ చాలా ఐకమత్యంగా పని చేస్తున్నప్పుడు, తమ రాజకీయ ప్రత్యర్ధిని పార్టీలోకి తీసుకురావడం వలన చాలా ఇబ్బందికరంయిన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుందని, కనుక అశోక్ రెడ్డిని పార్టీలో తీసుకోవద్దని వారు నారా లోకేష్ కి విజ్ఞప్తి చేసారు. కానీ నారా లోకేష్ వారి వాదనలను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకొన్న నిర్ణయాలకు అభ్యంతరం చెప్పవద్దని, అశోక్ రెడ్డి చేరికవలన ఏమయినా సమస్యలున్నట్లయితే వాటిని తను స్వయంగా పరిష్కరిస్తానని నారా లోకేష్ వారికి హామీ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. అంటే త్వరలో వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా తెదేపాలో చేరబోతున్నట్లే భావించవచ్చును.