ప్రభుత్వాలు ప్రజల్ని ఇన్‌స్టంట్‌గా ఆకర్షించడానికి వేలవేల కోట్ల రూపాయల సంక్షేమ లేదా ఆకర్షణీయ ప్రాజెక్టులను ప్రకటిస్తాయి. కానీ ఆ సొమ్ము మొత్తం ఎక్కడినుంచి తేవాలి? ప్రజలనుంచి ప్రభుత్వాలకు ఆదాయం రూపంలో సమకూరే మొత్తం ఒక స్థాయి వరకే ఉంటుంది. ఈ అదనపు వరాలకు అయ్యే వేల కోట్లు ప్రభుత్వాలకు ఎప్పుడూ భారంగానే ఉంటాయి. అయితే అలాంటి ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి..చంద్రబాబునాయుడు పఠించిన మంత్రం ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా తెగ నచ్చినట్లుగా కనిపిస్తోంది.
అమరావతి రాజధాని నిర్మాణానికి చేతిలో పైసా లేకపోయినా సరే.. పనులు పూర్తిచేయడానికి ల్యాండ్‌పూలింగ్ అనే విధానాన్ని చంద్రబాబు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో తాను ప్రకటించిన కొన్ని అత్యద్భుత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవడానికి ప్రస్తుతం కేసీఆర్ కూడా ఇదే బాట పట్టబోతున్నారు. హైదరాబాదులో నగర వాసుల జీవనాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో పాటు, నగరంలో తనదైన ముద్ర కనిపించేలా, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే కృషిలో భాగంగా.. మూసీ నది మీద ఆకాశమార్గాలు నిర్మించాలని, మూసీ పరీవాహక ప్రాంతం మొత్తం సుందరీకరణ పనులు చేపట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఈ పనులు మొత్తానికి సుమారు 20 వేల కోట్లు అవసరం కావొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడినుంచి తేవాలి? అనేది ప్రభుత్వం ముందున్న ప్రశ్న.
మూసీ తీరంలోని భూములను ల్యాండ్‌పూలింగ్ ద్వారా సేకరించి.. వాటిని లే అవుట్లు వేసి విక్రయించడం ద్వారా ఈ బృహత్ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు మొత్తం సమకూరుతాయని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి మూసీ తీరంలో ప్రభుత్వ, ప్రెవేటు భూములు ఏమేరకు ఉన్నాయో లెక్కతేల్చే పనిలో అధికారులు ఉన్నారు. మొత్తానికి చేతిలో సొమ్ము లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడానికి చంద్రబాబు ప్లాన్ ల్యాండ్‌పూలింగ్ ఒక్కటే మార్గమని కేసీఆర్ కూడా నమ్ముతున్నట్లుంది.