అక్కడకేదో తెరాసలో చేరిన వారంతా.. ప్రస్తుతం పశ్చాత్తాప పడిపోతున్నట్లుగా, ఆ విషయాన్ని తాము గుర్తించినట్లుగా.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దిగ్విజయసింగ్ మంగళవారం భాగ్యనగరానికి వచ్చినప్పుడు ఓ ప్రకటన చేశారు. తమ పార్టీని వదలి వెళ్లిన వారంతా తమ లబ్ధి చూసుకునే వెళ్లారని దెప్పిపొడిచిన ఆయన, ఎవరైనా మనసు మార్చుకుని తిరిగి తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం అని కూడా అన్నారు. ఆ ప్రకటన చేసి నిండా ఒక రోజు కూడా గడవ లేదు. అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు ఓ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం అయ్యారు.
చిట్టెం రామ్మోహనరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నించి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కేసీఆర్ మీద ఫైర్‌బ్రాండ్‌గా విరుచుకుపడే డీకే అరుణకు సోదరుడు. ఆయన ప్రస్తుతం గులాబీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారుతోంది.
రామ్మోహనరెడ్డి క్యాంప్ఆఫీసులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. కేసీఆర్ చేపడుతున్న విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన ప్రశ్రీనకటించినట్లు తెలుస్తోంది. రామ్మోహనరెడ్డి చేరికతో తెరాస గత ఎన్నికల సమయానికి అంతో ఇంతో బలహీనంగా ఉన్న పాలమూరు జిల్లాలో మరింత బలం పుంజుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.