కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఘరానా అల్లుడుగానే చెలామణి అయ్యారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా రాచమర్యాదలే అందుకొన్నారు. ఎన్ని చిలక్కొట్టుళ్ళు కొట్టినా ఎవరూ పట్టించుకొనేవారు కాదు. కానీ ప్రభుత్వం మారిన తరువాత కూడా అల్లుడుగారు తన జోరు తగ్గించుకోకపోవడం వలన స్వయంగా తను ఇబ్బందుల్లో పడటమే కాకుండా అత్తగారు సోనియా గాంధీని, బావగారు రాహుల్ గాంధీని, చివరికి కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారు. జూలై 21వ తేదీన ఆయన ఫేస్ బుక్ లో “పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. దానితో బాటే సమస్యలపై చర్చలను ప్రక్కదారి పట్టించే రాజకీయాలు మొదలయ్యాయి..కానీ వాటితో ప్రజలను మోసం చేయలేరు. భారతదేశాన్ని అటువంటి నేతలు నడిపిస్తున్నందుకు బాధపడుతున్నాను,” అని ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. అది తమని కించపరిచేదిగా ఉందని భావించిన బీజేపీ ఎంపీలు కొందరు ఆయనకు సభా హక్కుల నోటీసు ఇచ్చేరు. వారి అభ్యర్ధన మేరకు జూలై 25న స్పీకర్ కార్యాలయం ఆయనకి నోటీసు పంపింది. వారం రోజుల్లోగా సంజాయిషీ ఇమ్మని కోరింది. దానికి ఆయనిచ్చే సమాధానం బట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలా? లేక హెచ్చరించి క్షమించి విడిచిపెట్టాలా? అనేది సభాహక్కుల సంఘం నిర్ణయిస్తుంది. ఇదివరకు తన అత్తగారు దేశాన్ని ఏలుతున్నప్పుడు, రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించే సమయంలో పార్లమెంటుని ఎంత గొప్పగా నడిపించారో అల్లుడుగారు మరిచిపోయి, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటుని నడిపిస్తున్న తీరు చూసి తెగ బాధపడిపోతున్నారు పాపం!