భారత విదేశీ విధానం గొప్పదనం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. ఆనాడు కాశ్మీరును పాక్ ఆక్రమించుకొంటే దానిని తిరిగి వశపరుచుకొందామని వల్లబ్ బాయ్ పటేల్ సూచిస్తే, ‘వద్దు ఐక్యరాజ్యసమితికి మోర పెట్టుకొందామని’ చెప్పి నెహ్రూగారు మన విదేశీ విధానానికి ఒక గొప్ప బీజం వేశారు. అదే నేడు మన పీకకి చుట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తోంది. ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ గురించి మన పాలకులు మాట్లాడే సాహసం చేయకపోయినా పాక్ మాత్రం “మిగిలిన కాశ్మీర్ సంగతి ఏమిటి?” అని తరచూ అంతర్జాతీయ వేదికల మీద మనల్ని ధైర్యంగా నిలదీస్తూనే ఉంది. దానికి మనవద్ద సమాధానం లేదు అందుకే ఏవో అలవాటయిన కొన్ని పడికట్టు పదాలు వల్లిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఆ కారణంగా ఇప్పుడు మనం కూడా “కాశ్మీర్ సమస్య” అనేసుకొంటున్నామంటే అది మన విదేశీవిధానం గొప్పదనమే.
ఇంకా చైనా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాలతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉండాలని తాపత్రయపడుతున్నా అవి మాత్రం మనకి ఏదో ఒక సందర్భంలో హ్యాండ్ ఇస్తూనే ఉన్నాయి. వాటితో మనం, మనతో అవి వ్యవహరిస్తున్న తీరు, వాటితో మన సంబంధాలను చూసుకొంటే అది అర్ధం అవుతుంది. ఇరుగుపొరుగు దేశాలకి మనం ఎంత సహాయం చేసినా అవి తిరిగి భారత్ ని అసహ్యించుకొంటూనే ఉన్నాయి. అది మన విదేశీ విధానం గొప్పదనమేనని చెప్పుకోవచ్చును. ఓవర్ ఆల్ గా మనం అందరికీ సలాం కొడుతూ వాళ్ళచేత చ్చీ కొట్టించుకోవడమే మన విదేశీ విధానంగా చెప్పుకోవచ్చును.
ఇంతవరకు పాకిస్తాన్ కి సలాం చేస్తూ దాని ముందు మోకరిల్లిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ‘గతం గతః’ అనేసుకొంటూ మళ్ళీ మరొక పొరపాటుకి సిద్దమయిపోతోంది. అది కూడా మన విదేశీ విధానంలో గొప్పదన్నాన్ని పట్టి చూపేదిగా ఉండటమే విశేషం.
ఇంతకీ విషయం ఏమిటంటే భారత్-అమెరికాలు ఒక ఒప్పందం చేసుకోబోతున్నాయి. అది అమలులోకి వస్తే భారత్, అమెరికా సేనలు “ప్రత్యేక పరిస్థితులలో” ఒకరి వైమానిక, నేవీ స్థావరాలను మరొకరు ఉపయోగించుకొంటాయి. దానికి “లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజి మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్” (ఎల్ఈఎంఓఏ) అనే గంభీరమయిన పేరు పెట్టుకొన్నారు. దీనిపై ఇరు దేశాల మధ్య ప్రాధమికంగా అంగీకారం కుదిరిందని, దాని విధివిధానాలపై లోతుగా చర్చించిన తరువాత తుది ఒప్పందం కుదుర్చుకొంటామని రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ చెప్పారు.
ఇంతవరకు ప్రపంచంలో అమెరికా సైన్యం కాలు పెట్టిన ఏ దేశమూ కూడా సర్వనాశనం కాకుండా తప్పించుకోలేదనే చేదు నిజం అందరికీ తెలుసు. బహుశః ఆ సంగతి మన పాలకులకి కూడా తెలిసే ఉంటుంది. అమెరికా ప్రపంచ పోలీస్ పాత్ర పోషించాలని తహతహలాడుతుంటుంది కనుక అమెరికన్ సైనికులు భారత్ నేవీ, వైమానిక స్థావరాలను ఉపయోగించుకోవాలనుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చును కానీ అమెరికన్ స్థావరాలను ఉపయోగించుకోవలసిన అవసరం భారత్ కి లేదని కూడా అందరికీ తెలుసు. అయినా అటువంటి ఒప్పందం ఎందుకు చేసుకొంటోందంటే బహుశః పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాదులు, చైనా విసురుతున్న సవాళ్ళను భారత్ దీటుగా ఎదుర్కోలేదనే భయంతోనేనని అనుమానించవలసి వస్తోంది. అయితే ఒకవైపు పాకిస్తాన్ కి అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలు అమెరికా సరఫారా చేస్తూ మళ్ళీ పాక్ దాడుల నుంచి మన దేశాన్ని అమెరికా రక్షించాలని కోరుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే చైనా నుంచి భారత్ కాపాడే బాధ్యత అమెరికాకి అప్పగించాలనుకొంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. ఈ ఒప్పందం కుదిరితే ఇంతవరకు పాకిస్తాన్ కి సలాం చేస్తున్న మోడీ ప్రభుత్వం, అమెరికాకి కూడా సెల్యూట్ చేయడం మొదలుపెట్టినట్లు భావించవచ్చును.