వైఎస్ జగన్మోహనరెడ్డి తన పార్టీని కాపాడుకోవడానికి అనగా.. పార్టీనుంచి కొత్తగా ఎమ్మెల్యేలు ఎవ్వరూ తెలుగుదేశంలోకి వెళ్లిపోకుండా కట్టడి చేయడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సామూహికంగానూ, వెళ్లిపోతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగానూ ఇలా రకరకాలుగా అనేక భేటీలు నిర్వహించి పార్టీని వీడిపోవద్దంటూ మాటలతో చెప్పి చూశారు. అయినా ఏమీ ఫలితం కనిపించడం లేదు. సాక్షి కథనాల ప్రకారమే.. వచ్చే ఎన్నికల్లో అందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఖర్చు కూడా తెదేపా పార్టీ నే పెడుతుందని చంద్రబాబు ఇస్తున్న హామీ కొందరు వైకాపా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
అలాంటి నేపథ్యంలో.. పార్టీనుంచి కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా కట్టడి చేయడానికి ‘ధనాస్త్రం’ ప్రయోగించడానికి జగన్సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తున్నది. సాధారణంగా జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక సాయం చేయడం అనే మాటే ఉండదని నాయకులు అంటుంటారు. అయితే ఇప్పుడు గెలిచినవారు తెదేపాలోకి వెళ్లకుండా ఉండడానికి చివరికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నిధులు సమకూర్చి అయినా కాపాడుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ పనికోసం కూడా ఆయన గతంలో తన ద్వారా లబ్ధి పొందిన తనకు సన్నిహితులు అయిన ఇతర సన్నిహితులతో నిధులు ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గనుల కింగ్, మైనింగ్ కేసుల్లో ఉన్న జగన్కు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దనరెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న బళ్లారి నాయకుడు శ్రీరాములు తదితరులు ద్వారా తన పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఏర్పాటుచేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే రోజా.. ప్రభుత్వం మీద కోర్టు కేసు నడపడానికి తన వద్ద చాలినన్ని డబ్బుల్లేవంటే.. జగన్ భారీగా సమకూర్చి సుప్రీం కోర్టునుంచి సుప్రసిద్ధ న్యాయవాదుల్ని ఏర్పాటుచేసుకోవడానికి సహకరించడాన్ని దీనికి ఉదాహరణగా పలువురు చెబుతున్నారు.
అదే సమయంలో.. అసలు పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నప్పటికీ ఆయనకు పట్టదని, ఆర్థికసాయం అనేది కేవలం పుకారు కావచ్చుననే ప్రచారం కూడా పార్టీలో నడుస్తోంది.