హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మరణం, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. యూనివర్సిటీ పరిధిలో పరిష్కరించబడవలసిన ఒక సమస్యని రాజకీయ పార్టీలన్నీ కలిసి ఒక జాతీయ సమస్యగా మార్చివేసి, నిసిగ్గుగా దాని నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించాయి. ఆ కారణంగా సమస్య మరింత జటిలంగా మారింది. అయితే నేటికీ ఆ సమస్య (వెనుకబడిన కులాల విద్యార్ధులను వేధించడం, రోహిత్ కి న్యాయం చేయడం) అపరిష్క్రుతంగానే మిగిలి ఉంది. రోహిత్ ఆత్మహత్య చేసుకొని సుమారు నాలుగు నెలలు అవుతున్నా నేటికీ అందుకు బాధ్యులను గుర్తించలేదు. ఎవరిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టలేదు. రోహిత్ మృతికి కారకుడుగా ఆరోపించబడుతున్న యూనివర్సిటీ వైస్-ఛాన్సిలర్ అప్పారావు కొన్ని రోజులు శలవుపై వెళ్లి వచ్చి మళ్ళీ బాధ్యతలు చేపట్టి, యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఈ కేసులో ఆయన లాంగ్ లీవు మీద వెళ్లి రావడమే, రోహిత్ కి న్యాయం చేయడంగా ఆయన, ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లుంది.
ఈ సమస్యని యూనివర్సిటీ అధికారులు కానీ, కేంద్రప్రభుత్వం గానీ పరిష్కరించలేదు. కనీసం న్యాయస్థానాలు కూడా రోహిత్ మృతికి కారకులయినవారిని శిక్షించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సమస్య నేటికీ అపరిష్క్రుతంగానే మిగిలి ఉంది కనుక ఏదో ఒకనాడు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఈ సమస్యలో రెండవ అంశానికి మాత్రం హైకోర్టు ఒక పరిష్కారం చూపింది. రాజకీయ నేతలు, యూనివర్సిటీతో సంబంధం లేనివారు యధేచ్చగా లోపలకి ప్రవేశిస్తూ తమ రాజకీయ లబ్ది కోసం విద్యార్ధులను రెచ్చగొడుతున్నారు. అందుకే ఈ సమస్య ఇంకా జటిలం అవుతోంది కనుక బయట వ్యక్తులు ఎవరినీ యూనివర్సిటీలోకి అనుమతించవద్దని హైకోర్టు యూనివర్సిటీ అధికారులకు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కి నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.