తెలుగు జర్నలిజాన్ని మీడియాను చిత్ర నిర్మాణాన్ని వందల మైళ్లు ముందకు తీసుకువెళ్లిన సి.హెచ్.రామోజీరావుకు ఆలస్యంగానైనా పద్మ విభూషణ్ పురస్కారం దక్కినందుకు అంతా అభినందించారు. ఎవరి రాజకీయాలు అభిప్రాయాలు ఎలా వున్నా ఈ రంగాలకు ఆయన చేసిన అమోఘ సేవలను ఎవరూ ఆక్షేపించరు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన కృతజ్ఞతా ప్రకటనలోని కొన్ని భావాలు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి.
పత్రికలది సహజంగా ప్రతిపక్ష పాత్ర అని అనేకసార్లు ప్రకటించిన ఆయన ఆధ్వర్యంలోని సంస్థలు ఇటీవలి కాలంలో అంత విమర్శనాత్మక పాత్ర నిర్వహించడం లేదనే అభిప్రాయం క్రమేపీ పెరుగుతున్నది. నిజానికి ఎన్నడూ లేనిది మోడీ ప్రభుత్వంతో దాదాపు ఆయన సంఘీభావమే ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపట్ల కేంద్రం పట్ల కూడా సుతిమెత్తటి పాత్ర చేపట్టిన కారణంగా కథనాలు వ్యాఖ్యానాలు ఆనాడు వున్నట్టు వుండడం లేదని వీరాభిమానులు కూడా చెప్పుకుంటున్న స్థితి. ఈ వైఖరి వల్లనే వాటికి ప్రభుత్వాల నుంచి గానీ, అధికార పీఠాల నుంచి గాని ఎలాటి సమస్యలు ఎదురవకపోవచ్చు. కాని ఇతరత్రా చూస్తే గత ఏడాదిన్నర లోనూ తెలుగునాట మీడియా సంస్థలు చాలా సమస్యలే ఎదుర్కొన్నాయి.
(మొదట్లో ఈనాడు నాటి కాంగ్రెస్ నుంచి ఎదుర్కొన్న దాడులు, వైఎస్ హయాంలో ప్రతికూలత కూడా మర్చిపోలేము) తెలంగాణలో రెండు చానళ్లు చాలా కాలం ప్రసారం కాలేదు. ఎపిలో మరో ఛానల్ అరకొరగానే నడిచి ఆ పైన ముఖ్యవ్యక్తులను మార్చిన తర్వాతనే చల్లగా నడవగలుగుతున్నది. ఇంకా ఏమవుతుందో చూడాలి.
ప్రతిపక్ష నేత ఆధీనంలోని ఛానల్, పత్రికలపై రోజూ వ్యాఖ్యలే గాక స్వాధీనం చేసుకుంటామన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గాని, తమిళనాడులో జయలలిత గానీ, ముంబాయి గుజరాత్ వంటి చోట్ల శివసేన బిజెపలుి గాని మీడియాపై దోడులకు దిగిన ఉదాహరణలు అనేకం. ఆధారాలు చూపించకపోతే మీడియా కథనాలపై చర్య తీసుకుంటామని పాలకులు హెచ్చరిస్తున్నారు కూడా.
కుల మత తత్వాలు, ప్రాంతీయ ప్రజ్వలనాలు పెరిగిన నేపథ్యంలో పత్రికలు ఏది ఎలా రాయాలన్నది కూడా సమస్యగా మారిపోతున్నది. ఇటీవల అసహనం చర్చ సందర్భంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన మీడియా ప్రముఖులపై , కాలమిస్టులు రచయితలపై ప్రత్యక్షంగానే దాడి చేయడం, ముద్రలు వేయడం చూశాం.
పెయిడ్ న్యూస్‌కు తోడు సోషల్ మీడియాలో పెయిడ్ వ్యూస్ కూడా చలామణిలోకి వచ్చాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ఇచ్చింది. కనుక మీడియా, సాహిత్య రంగాలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు ఇవన్నీ ఉదాహరణలు. రామోజీ రావుకు పద్మ విభూషణ్ ప్రదానం ఆయనపై వున్న గౌరవాభిమానాలకు సంకేతం కావచ్చు గాని పత్రికా స్వేచ్చకు నిదర్శనమంటే ఒప్పుకోవడం కష్టం. ఏది ఏమైనా మరోసారి ఆయనకు హృదయపూర్వక అభినందనలు.