వర్షం పడితే ఒక క్రికెట్ మ్యాచ్ ఆగిపోతుందనే సంగతి మనకు తెలుసు. కానీ, వర్షాలు పడకపోతే, అనగా నీటి కరువు ఉన్నట్లయితే ఏకంగా బోలెడన్ని మ్యాచ్ లు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అవును మరి. ఇది కొత్త నీతి. అవును నీటకరవు మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లకు గ్రహణంగా మారింది. సుమారు 75 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉండే ఐపీ ఎల్ మ్యాచ్ లను ఆ రాష్ట్రంలో విపరీతమైన నీటి కరవు నేపథ్యంలో నిర్వహించకూడదంటూ హైకోర్టులో ఓ పిటిషన్ పడిన సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా అక్కడ మ్యాచ్ ల నిర్వహణ సస్పెన్స్ గానే ఉంది. తాజాగా బుధవారం నాడు కోర్టు ఐపీఎల్ కు షాక్ ఇచ్చే తీర్పు చెప్పింది. ఈనెల 30 తరువాత నిర్వహించే మ్యాచ్ ల వేదిక ను ముంబాయినుంచి మార్చాలని పేర్కొన్నది. ఈ నిర్ణయం వలన మొత్తం 13 మ్యాచ్ ల మీద ప్రభావం పడుతుంది. వాటిని ఇతర నగరాలకు తరలించాల్సి ఉంటుంది.
ఈ కేసులో.. తాము నీటిని దుర్వినియోగం చేయడంలేదని రీసైకిల్ చేసిన నీటినే వాడుతాం అని.. రకరకాలుగా ఐపీఎల్ నిర్వాహకులు వాదించినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఐపీఎల్ అనే దానిని కనీసం క్రికెట్ క్రీడ, క్రీడారంగానికి చెందిన మంచి ఈవెంట్ లాగా చూడకుండా.. ఒక ఎంటర్ టైన్ మెంట్ వ్యవహారం లాగా, ఒక వ్యాపారం లాగా మాత్రమే కోర్టు చూస్తుండడం వలన ఇలాంటి తీర్పులు వచ్చి ఉంటాయని పలువురు అంటున్నారు.
ఇప్పుడు మ్యాచ్ లు జరగక పోవడం వలన మహారాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉన్నదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కోర్ట్ నిర్ణయాన్ని తప్పు పట్టడం కాకపోయినప్పటికీ, అసలు ఐపీఎల్ మ్యాచ్ ల మీద కోర్ట్ కు ఆశ్రయించిన వారిని హైదరాబాద్ లోని క్రికెట్ అనలిస్టు వెంకటేష్ తప్పు పట్టారు. ఐపీఎల్ మీద పబ్లిసిటీ కోసం కేసు వేస్తున్నట్లు అయన అభిప్రాయపడ్డారు. రేస్ కోర్స్ వంటి అనేక అవసరాలకు పెద్ద మొత్తంలో నీరు వాడుతారని, వాటన్నిటినీ వదిలేసి, క్రికెట్ మీద పడ్డారని అన్నారు.
హైదరాబాద్ లో మ్యాచ్ లు పెరుగుతాయి
ముంబై లో మ్యాచ్ లు జరగకుండా హై కోర్ట్ తీర్పు ఇచ్చిన పర్యవసానం హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మహా వేదిక విషయంలో కోర్ట్ తీర్పు ఎలా వస్తుందో అనే ఉద్దేశంతో తొలినుంచి మొహాలి స్టేడియం ను ప్రత్యామ్నాయంగా ఉంచుకున్న. దీనికి అదనంగా కోల్ కత, హైదరాబాద్ నగరాల్లో జరిగే మ్యాచ్ ల సంఖ్యా పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి హైదరాబాద్ లోని క్రికెట్ ప్రియులకు ఈ ఐపీఎల్ సీజన్ పండుగ వాతావరణాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.