ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు అయింది. మాల వర్గానికి చెందిన ప్రముఖ ఎస్సీ నేత కారెం శివాజీని ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటూ కొనసాగుతారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. ఆ సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కేటాయించే నిధులన్నీ ఈ కార్పొరేషన్ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ గురించి చాన్నాళ్ల కిందట హామీ ఇచ్చిన చంద్రబాబు ఇన్నాళ్లకు దాన్ని ఆచరణలో పెట్టారు.
అయితే మాల వర్గానికి చెందిన కారెం శివాజీని ఈ పదవిలో కూర్చోబెట్టడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీల్లో ఏబీసీడీల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటినుంచి మాదిగ వర్గంలో చంద్రబాబునాయుడుకు కొంత అనుకూలత ఉంది. గత ఎన్నికల సమయానికి మాదిగవర్గం చంద్రబాబుకు, మాల వర్గం జగన్‌కు అనుకూలంగా ఉంటారనే అంచనాలు సాగాయి. అయితే ఆ వర్గీకరణ కార్యరూపం దాల్చలేదు. దానికి తాను వ్యతిరేకం కాదంటూ ఆయన ఆ విషయాన్ని న్యాయపరమైన చిక్కుల సాకుతో పక్కన పెట్టారు.
ఇటీవలి కాలంలో మాదిగనేత మందకృష్ణ చంద్రబాబు మీద కారాలు మిరియాలు నూరడం మాత్రమే కాదు.. వైఎస్ జగన్ కోటరీకి దగ్గరై ఇంచుమించుగా చంద్రబాబు మీద ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు మాల వర్గానికి చెందిన కారెం శివాజీ చేతికి ఎస్సీఎస్టీ కార్పొరేషన్ పగ్గాలు ఇవ్వడం కీలకమైన నిర్ణయం. జగన్‌కు బలం ఉన్న సామాజిక వర్గాన్ని తనవైపు ఆకట్టుకోవడంతో పాటు, మందకృష్ణ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇలా పావులు కదిపారని పలువురు అంటున్నారు.