కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ పనుల కోసం మంజూరు చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లెక్కలు చూపడం లేదని పురందేశ్వరి వంటి భాజపా నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లెక్కలు చూపలేదని ఆమె నిర్దిష్టంగా విమర్శలు చేసారు. అంతే కాదు పోలవరం ప్రాజెక్టుతో పట్టిసీమకు ఎటువంటి సంబంధమూ లేదని చెపుతూనే దాని ఖర్చులను కూడా పోలవరం పద్దులో చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె నిర్దిష్టంగా చేసిన ఈ విమర్శలకు తెదేపా నేతలు జవాబు చెప్పలేదు ఆమెపై ఎదురుదాడి చేసారు.
ఇప్పుడు తాజాగా నీతి ఆయోగ్ కూడా రాజధాని కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులకి లెక్క చెప్పమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలుస్తోంది. ఆ నిధులలో హైకోర్టు, రాజ్ భవన్ తదితర నిర్మాణాల కోసం రూ.850 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపిన లెక్కల గురించి నీతి ఆయోగ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఒక ప్రముఖ పత్రిక బయటపెట్టింది. అదే నిజమయితే పురందేశ్వరి వంటి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమనే నమ్మవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు, మంత్రులు అందరూ ‘అమరావతి డ్రీం సాంగ్’ కోరస్ గా పాడుతూ రోజులు దొర్లించేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం తప్ప మరే పని మొదలవలేదు. ఇంకా ఎప్పుడు మొదలవుతాయో కూడా ఎవరికీ తెలియదు. అంతవరకు సింగపూర్ సంస్థలు గీసిచ్చిన అందమయిన అమరావతి ఫోటోలను చూస్తూ ప్రజలు కూడా కాలక్షేపం చేసేస్తుంటే మధ్యలో ఈ రాజ్ భవన్, హైకోర్టు నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ మొదలుపెట్టారో తెలియడం లేదు. కోరస్ సాంగ్ లో తాత్కాలిక సచివాలయం గురించి మెన్షన్ చేస్తున్నారు తప్ప వీటి గురించి ఎప్పుడూ మెన్షన్ చేయలేదు కనుక ఈ సంగతి మీడియాకి, ప్రజలకి కూడా ఇంతవరకు తెలియలేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటి కోసం నిధులు వినియోగ పత్రాలు పంపించడం నిజమయితే మిగిలిన భవనాలని కూడా కాగితాల మీదనే నిర్మించేస్తారేమో?