మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రభావం కేవలం భారతదేశంపైనే కాదు యావత్ ప్రపంచంపై కూడా ఉందని నిరూపిస్తూ ఆయన జన్మదినమయిన అక్టోబర్ 15వ తేదీని విద్యార్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహార్ లాల్ నెహ్రూ తరువాత పిల్లలతో, విద్యార్ధులతో అంతగా మమేకమయిన వ్యక్తి అబ్దుల్ కలాం మాత్రమేనని చెప్పవచ్చును. ఆయనకు రక్షణ, విమాన, అంతరిక్ష రంగాలలో చాలా విపరీతమయిన అభిమానం, ఆసక్తి ఉన్నప్పటికీ, తను అమితంగా ఇష్టపడేది మాత్రం పిల్లలతో కలిసి గడుపుతూ వారికి పాఠాలు చెప్పడమేనని ఆయనే స్వయంగా చెప్పేవారు. 2007సం.లో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత ఆయన దేశ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్ధులలో స్ఫూర్తి నింపేవారు. చివరికి ఆయన తన చివరి గడియలలో కూడా షిల్లాంగ్ ఐ.ఐ.యం. విద్యార్ధుల ముందు ప్రసంగిస్తూ అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలి తుది శ్వాస విడిచారు. కులమతప్రాంతాల అడ్డుగోడలు తొలగించుకొని భారతీయులందరూ సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని ఆయన అభిలాషించేవారు. స్పూర్తిదాయకమయిన ఆయన హితోక్తులను మన రాజకీయ నాయకులు పట్టించుకోకపోయుండవచ్చును. కానీ ఆయన మాటలతో ప్రేరణ పొందినవారు దేశవ్యాప్తంగా అనేకమంది విద్యార్ధులున్నారు. విశ్వమానవ సౌబ్రాతత్వం కోరుకొన్న ఆ మహనీయుడికి ఐక్యరాజ్యసమితి కూడా ఘన నివాళులు అర్పించి ఆయన జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా ప్రకటించింది.