తెలంగాణలో గులాబీ పార్టీ ‘ఆకర్ష కాంగ్రెస్’ ఉద్యమం తాజా ఇన్నింగ్స్ ఇప్పుడే ప్రారంభం అయిందా? చిట్టెం రామ్మోహనరెడ్డితో ప్రారంభమైన తాజా ఇన్నింగ్స్ ఫిరాయింపులు ఇంకా చాలా జరగబోతున్నాయా? ఇంకా బోలెడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. మొత్తానికి శాసనసభ ఈసారి సమావేశం అయ్యేలోగా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేని స్థితికి తీసుకువెళ్లిపోయేలాగా తెరాస పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.
మరి కొన్ని వారాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మరింతగా పడిపోతుందని రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఆపార్టీ 21 స్థానాలు గెలుచుకుంది. అందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించగా, ఉప ఎన్నికలో ఆ సీటు తెరాసకు దక్కింది. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇటీవలే మరణించారు. ఇకపోతే కాంగ్రెస్కు మిగిలింది 19 స్థానాలు! ఇప్పటిదాకా మొత్తం అయిదుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోయారు. ఏతావతా 21 స్థానాలు గెలిచిన పార్టీకి ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో ఇంకా ఎందరు గులాబీ బాటలో ఉన్నారో తెలియదు.
ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం సభ్యులుండాలి. అంటే 119 సీట్ల సభలో కనీసం 12 మంది ఉండాలి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గనుక గులాబీ తీర్థం పుచ్చుకుంటే హోదా కూడా వారికి దక్కకుండా పోతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. నిజానికి ఇప్పటికే మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలనుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాబీ నాయకులతో బేరాలాడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు టికెట్ గ్యారంటీ ఇస్తే చాలు అనే ఒప్పందంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇవి గనుక నిజమైతే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.