తెలుగు రాష్ట్రాల్లో హైస్కూలు స్ధాయివరకూ స్టేట్ సిలబస్ లోని టెక్స్ట్ బుక్స్ ఇపుడు e పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. వీటితోబాటు ఎన్ సి ఇ ఆర్ టి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) పాఠ్య పుస్తకాలను కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు తమ పోర్టళ్ళలో వుంచాయి. వీటిని నేరుగా, ఉచితంగా కంప్యూటర్లు, లాప్ టాప్ లలోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీటికి యాప్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. యాప్స్ ద్వారా e బుక్స్ ని మొబైల్ మొబైల్ ఫోన్లలోకి, టాబ్లెట్ పిసిలలోకీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మీడియంలలో ఈ-పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని చాప్టర్ల వారీగా టాపిక్‌లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అదే స్టేట్ సిలబస్‌లో అయితే పాఠాలవారీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 1నుండి ప్లస్ టు స్థాయి వరకూ విద్యార్ధులకు అన్ని పాఠ్యపుస్తకాలను ఈ-పాఠశాల డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ పేరిట మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా సహ పాఠ్యప్రణాళికకు సంబంధించి కూడా మాన్యువల్స్‌ను వర్కుబుక్‌లను రూపొందించింది. టీచర్లకు, విద్యార్ధులకు, విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా ఈ యాప్ ద్వారా తాజా సమాచారం సమగ్రంగా లభిస్తుంది. సెల్ఫోన్లు, ట్యాబ్‌లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలను ఉచితంగా చూసుకోవచ్చు. ఆంధ్ర ప్రభుత్వం ఎపిఎస్సీఇఆర్టి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీఇఆర్‌టి తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోనూ, స్టేట్ సిలబస్ పాఠ్యపుస్తకాలను ఉంచుతోంది. ఈ ఏడాది తెలంగాణలో, ఆంధ్రలో కొన్ని పుస్తకాలు మారుతున్నాయి. ఇప్పటికే పాత సిలబస్‌తో ఉన్న పుస్తకాలను నెట్లో ఉంచారు. కొత్త పుస్తకాలు రాగానే వాటిని సైతం వారం పది రోజుల్లో అప్డేట్ చేయనున్నారు.
రాష్ట్ర సిలబస్ పుస్తకాలతోపాటు బిఇడి విద్యార్థులకు, డి.ఇడి విద్యార్థులకు సిలబస్, ఈ-పుస్తకాలు, కో కరిక్యులమ్ పుస్తకాలు, వాటి సిలబస్‌ను కూడా నెట్లో చేర్చింది. ఈ-టెక్ట్స్ బుక్స్, సప్లిమెంటరీ బుక్స్, ఈ-రీసోర్సెస్ పేరిట వీటిని అందుబాటులోకి తెచ్చారు. పుస్తకాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని విద్యార్థులపైనా, తల్లిదండ్రుల పైనా వత్తిడి చేసే పద్ధతిని పాఠశాలలు మానుకోవాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక సర్కులర్ లో సూచించింది.
అతి పెద్ద భారీ సీజనల్ పరిశ్రమ గా విస్తరించిన టెక్ట్స్ బుక్స్ , నోట్ బుక్స్ ప్రింటింగ్, తయారీ, అమ్మకాల్లో వందల కోట్ల రూపాయల ఎకనామిక్స్, వేలమంది ఉపాధి వున్నాయి. ఇ బుక్స్ వినియోగం పెరిగేకొద్దీ ఈ రంగంలో వున్నవారు ప్రత్యామ్నాయ రంగాలకు వలసలు పోవలసిందే!