కెసిఆర్ మంత్రివర్గంలో దళితులు, మహిళలు లేరని తెలుగుదేశం బిజెపి విమర్శిస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి పదవి దళితుడికి ఇస్తామని చెప్పి తర్వాత రాజకీయ సవాళ్లను ఎదుర్కొనాలనే పేరుతో తనే ఆ స్థానం చేపట్టారని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బైండ్లవాళ్లు గాని దళితుడు కాదని తెలుగుదేశం ఇదివరకే విమర్శించగా తాజాగా మోత్కుపల్లి నరసింహులు ఆ విమర్శ మళ్లీ ముందుకు తెచ్చారు. కాకపోతే నేరుగా చెప్పకుండా మీరే తెలుసుకోండి అని దాటేశారు.
మరి కడియం శ్రీహరి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశంలో వున్నప్పుడు దళితనేతగానే మీరు ముందుకు తెచ్చారు కదా అనే ప్రశ్నకు ఆ నాయకులు సమాధానం దాటేస్తుంటారు. అన్నిటినీ మించి ఎన్టీఆర్ పార్కులో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ఉద్దేశించిన కమిటీకి కూడా మంత్రి జగదీశ్‌రెడ్డిని అద్యక్షుడుగా నియమించవలసిన అవసరం వుందా అనేది కెసిఆర్‌పై వస్తున్న పెద్ద విమర్శ.
ఈ సందర్భంగా వేసిన పోస్టర్లలోనూ ఆయన చిత్రమే వేశారు! కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిబా ఫూలే కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గైరుహాజరయ్యారు. ఇవన్నీ అణగారిన తరగతుల పట్ల అలక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎపిలో కూడా గిరిజన మంత్రి మైనార్టి మంత్రి లేకపోవడం విమర్శలకు గురవుతున్నది.
ఇక రెండు రాష్ట్రాల్లోనూ సామాజిక సంక్షేమ చర్యలు, ఉప ప్రణాళికలు సక్రమంగా అమలు కాలేదని కాగ్ నివేదికే విమర్శించింది. అందుకే అంబేద్కర్ కీర్తనలతో పాటు, ఆచరణను కూడా ఈ అధినేతలు సమీక్షించుకోవడం అవసరం. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌లో ఎస్సి ఎమ్మెల్యే గువ్వల బాలరాజును దూషించినట్టు విమర్శలనెదుర్కొంటున్న ఎంఎల్ఎ రామమోహనరెడ్డిని కూడా సరిగ్గా ఈ సందర్బంలోనే టిఆర్ఎస్లో చేర్చుకోవడం కూడా విడ్డూరంగా వుందని ఆ తరగతులకు చెందిన మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు.