రేపు సినిమా రిలీజ్ పెట్టుకొని.. ఈరోజు టైటిల్ మారిస్తే ఎలా ఉంటుంది? బహుశా ఇప్పటి వరకూ టాలీవుడ్లో ఇలాంటి విచిత్రం జరిగి ఉండదు. దిల్‌రాజుకే ఆ ఘనత దక్కింది. తమిళంలో తెరకెక్కిన తెరి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారాయన. విజయ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి దిల్ రాజు పోలీసోడు అనే టైటిల్ పెట్టాడు. ఆ టైటిల్ చుట్టూనే వివాదాలూ, సమస్యలు మొదలయ్యాయి. ఈ సినిమా టైటిల్ పోలీస్ వాళ్ల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు దిల్‌రాజుని సంప్రదించారు. ఎందుకొచ్చిన గొడవ అనుకొన్నాడేమో… ఇప్పుడు ఈ టైటిల్‌ని పోలీసోడు నుంచి పోలీస్‌గా మార్చేశారు. అయితే ఇప్పటికే పోస్టర్లు, ఫెక్ల్సీలు, లాలీపాప్లూ రెడీ అయిపోయాయి. ఇప్పటికిప్పుడు అర్థాంతరంగా వాటిని ఎలా రీప్లేస్ చేస్తారో చూడాలి. అన్నట్టు ఈ సినిమాకి తెలుగులో ప్రమోషన్ కరువైపోయింది. సినిమా విడుదల శుక్రవారమే అయినా.. ప్రమోషన్ పరంగా ఇంకా నత్తనడక నడుస్తూనే ఉంది. ఈలోగా ఏకంగా పేరే మారిపోయింది. పాపం.. దిల్‌రాజు. ఆయనకు అన్నీ సమస్యలే.