చేతులు కాలితే గానీ ఆకులు కోసం వెతికే అలవాటు బొత్తిగా లేని మన పాలకులకు ఉగ్రవాదుల దాడులు, ప్రమాదాలు జరిగిన తరువాతనే తప్పేమిటో గ్రహిస్తుంటారు. కనీసం కొన్ని ప్రాణాలు పోయిన తరువాతయినా ఆ లోపాన్ని సవరించుకొంటారా..ఆ సమస్యకి శాశ్విత పరిష్కారం చేస్తారా అంటే అదీ ఉండదు. ఏదయినా జరిగిన వెంటనే హడావుడి చేయడం ఆనక మళ్ళీ మామూలే.
కేరళలోని కొల్లాంలో ఆలయ పరిసరాలలో బాణాసంచా ప్రదర్శనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయి అనేకమంది తీవ్రంగా గాయపడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు హడావుడిగా దేవాలయాలలో బాణాసంచా కాల్చడాన్ని నిషేదించడం మొదలుపెట్టాయి. అంటే ఎన్నో కొన్ని ప్రాణాలు బలయితే తప్ప ప్రభుత్వాలు ఒక సమస్యని గుర్తించలేవు…మేల్కొనలేవన్న మాట! కొల్లాంలో బాణాసంచా వలన ప్రమాదం జరిగింది కనుక దానిని నిషేదించి చేతులు దులుపుకొన్నారు. కానీ ఆలయాలలో ఏనుగులను ఉపయోగించడాన్ని నిషేదించాలంటే, వాటికీ కొన్ని ప్రాణాలు బలివ్వాలేమో?
నేటికీ దక్షిణాదిన అనేక ఆలయాలలో ముఖ్యంగా కేరళలో ఏనుగులు తప్పనిసరి. అవి లేకుండా కొన్ని ఉత్సవాలు జరపడం ఎవరూ ఊహించుకోలేరు కూడా. కేరళలో ప్రతీ ఏటా జరిగే ‘త్రిస్సూర్ పూరం’ ఉత్సవాలను ‘ప్రపంచంలో కెల్లా అత్యద్భుతమయిన కార్యక్రమం’ అని యూనిసెఫ్ చేత ప్రశంసలు అందుకొన్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ ఉత్సవాలలో చాలా అందంగా అలంకరించిన కొన్ని డజన్ల ఏనుగులను వినియోగిస్తారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కన్నుల పండుగగా జరిగే ఆ ఉత్సవాలను చూడటానికి దేశవిదేశాల నుంచి వేలాదిమంది ప్రజలు తరలివస్తుంటారు.
కొల్లాం ఘటన తరువాత మేల్కొన్న కేరళ ప్రభుత్వం ఈ ఉత్సవాలలో ఏనుగుల వినియోగంపై మొదట కొన్ని ఆంక్షలు విధించింది కానీ మళ్ళీ వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి తన ఆదేశాలను ఉపసంహరించుకొంది. ఏనుగుల వలన ప్రమాదం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని సర్దిచెప్పుకొంది. ఒక్క కేరళలోనే కాకుండా తిరుపతి వంటి అనేక పుణ్యక్షేత్రాలలో కూడా ఏనుగులను ఉపయోగిస్తుంటారు.
వేలాదిమంది భక్తులు కిక్కిరిసి ఉన్న ప్రాంతాలలో ఆ భారీ జంతువులు అదుపు తప్పితే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఊహించుకోవచ్చును. కానీ ఇంతవరకు అటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి కనుక ఎన్నడూ జరుగవనే ధీమా వ్యక్తం అవుతుంటుంది. అందుకే ఏనుగుల వలన కలిగే ప్రమాదాల గురించి ఎన్నడూ ఆలోచించడం లేదు. అలాగే పుణ్యక్షేత్రాలలో అగ్నిప్రమాదం ఏదయినా జరిగితే వేలాదిగా ఉండే భక్తులను సురక్షితంగా ఏవిధంగా బయటకి తరలించాలనే విషయం గురించి కూడా ఎన్నడూ ఆలోచనలు చేసిన దాఖలాలు లేవు. ఆలోచన చేయాలంటే కొంతమంది ప్రాణాలు బలవ్వాలేమో?