కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్ర కూడా రాజకీయాలలోకి రాబోతున్నారా? అంటే ఆయన మాటలు విన్నట్లయితే అవుననే అర్ధమవుతుంది. “ఈ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలిగే శక్తి నాకుంది. ఎందుకంటే నాకు నా కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. అన్ని రకాల మంచి చెడు అనుభవాలను ఎదుర్కొన్నాను. కనుక ఎన్ని అవమానాలు ఎదురయినా దేశం విడిచివెళ్లిపోను. ఇక్కడే ఉండి పోరాడి న శక్తి ఏమిటో నిరూపించుకొంటాను,” అని వాద్ర డిల్లీలో మీడియాతో అన్నారు.
“రాజకీయాలలో ప్రవేశం గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ “రాజకీయాలలోకి రానని చెప్పను. నా వలన ఈ దేశంలో ఏదయినా మార్పు సాధ్యమని ప్రజలు భావించి, నేను రాజకీయాలలోకి రావాలని వారు కోరుకొన్నట్లయితే తప్పకుండా ఆలోచిస్తాను. నా భార్య తరపువారి కుటుంబం తరతరాలుగా ఈ దేశ రాజకీయాలలో ఎటువంటి కీలకపాత్ర పోషిస్తోందో నాకు తెలుసు కనుక ఒకవేళ నేను రాజకీయాలలోకి ప్రవేశించినట్లయితే వారి పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా నా వలన వారికి ఇంకా గౌరవం పెరిగేలా వ్యవహరించాలని నాకు తెలుసు. నేను రాజకీయాలలో రాణించగలననే నమ్మకం నాకుంది. నా తండ్రి నాకు తగినంత చదువులు చదివించారు. చదువుతో బాటు తగినంత లోకజ్ఞానం కూడా ఉంది. కనుక ఎటువంటి పరిస్థితులు, సమస్యలనయినా నా భార్య ప్రియాంక సహకారం లేకపోయినా ఎదుర్కోగలనని చెప్పగలను. ఆ సత్తా నాకుందనే నేను నమ్ముతున్నాను,” అని రాబర్ట్ వాద్ర చెప్పారు.
కనుక రాబర్ట్ వాద్రా కూడా ప్రత్యక్ష రాజకీయాలలో రావడానికి సిద్దం అని స్పష్టమయిన సంకేతాలు ఇచ్చేసినట్లే భావించవచ్చు. ‘ప్రజలు కోరితే..’ అనే పదం ప్రజల సంతృప్తి కోసమే తప్ప వారు వద్దన్నా అల్లుడుగారు రాజకీయాలలోకి రావాలని ఫిక్స్ అయిపోతే రాకుండా మానరు. కనుక రావడమయితే ఖాయం చేసారు కానీ దానికి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారో ఇంకా ప్రకటించలేదు.
ఈ దేశాన్ని, దానిలో వ్యవస్థలని, ప్రభుత్వాలని, రాజకీయాలను ఆ మురికికూపంలో ఈదులాడుతున్న కాంగ్రెస్ పార్టీని అన్నిటినీ రాహుల్ గాంధి తన వద్ద ఉన్న మంత్రదండంతో మార్చేయాలనుకొన్నారు. కానీ ఎన్నికల సమయంలో ఆ మంత్రం దండం ఎక్కడో పడిపోతే అది మోడీ చేతికి చిక్కడంతో ఆయన ప్రధానమంత్రి అయిపోయేరు. రాహుల్ గాంధి వలన కాని ఆ పనులన్నిటినీ ప్రియాంక చక్కబెడతారని కాంగ్రెస్ జీవులన్నీ ఆశగా ఎదురుచూస్తుంటే ఆమె అవసరం లేకుండా తనే అన్నీ చక్కబెట్టేయగలనని రాబర్ట్ వాద్ర చెపుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని అల్లుడుగారు టేక్-ఓవర్ చేయాలనుకొంటున్నారేమో? ఏమో?