వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తోంటే ఒకరకంగా జాలి కలుగుతోంది. చంద్రబాబు వ్యూహాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఫిరాయించేస్తూ ఉంటే.. పాపం సంఖ్యపరంగా ఎమ్మెల్యేల బలం తగ్గిపోతున్నందుకు మాత్రమే కాదు. తమ పార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉండేలా కాపాడుకోవడానికి పాపం వారు నానా పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో జగన్ వైఖరి ఎలా ఉన్నదో ఏమో గానీ.. పార్టీ నాయకులు తమంతగా శ్రద్ధ తీసుకుని, ఫిరాయించదలచుకున్న వారిని బుజ్జగించి ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తోంటే జాలి కలుగుతోంది. ఫిరాయించడానికి నిర్ణయించుకున్న వారు, వీరిని పట్టించుకోకపోవడం, చివరికి అవమానకరంగా వ్యవహరరించడం ఈ సందర్భంగా గమనార్హం.
వైకాపా నుంచి ఇప్పటికి పదిమంది ఫిరాయించారు. మరో రెండు వికెట్లు కూడా ఖరారయ్యాయి. వీరిలో తొలుత వెళ్లిన భూమా నాగిరెడ్డిని, తాజాగా వెళుతున్న బొబ్బిలి సుజయకృష్ణ రంగారావును ఆపడానికి ప్రయత్నాలు జరిగాయి. వీరిద్దరిలో భూమా నాగిరెడ్డి చాలా బెటర్ అని పార్టీ నాయకులు అంటున్నారు.
భూమా వద్దకు వైకాపా రాయబారులు వెళ్లినప్పుడు ఆయన కనీసం వారితో కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా చర్చలైనా సాగించారు. వారి ప్రతిపాదనలకు ఒప్పుకుని, తెదేపాలో చేరాలనే నిర్ణయం మార్చుకోకపోయినప్పటికీ.. ఎట్‌లీస్ట్ వారిని గౌరవంగా ఇంట్లోకి పిలిచి వారితో చర్చల వరకు సాగించారు.
అయితే బొబ్బిలి రాజుల వైఖరి మరీ టూమచ్‌గా ఉన్నదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు బుజ్జగించడానికి వెళితే.. సుజయకృష్ణ రంగారావు కనీసం వారిని కలవడం కూడా ఇష్టం లేకుండా.. వారు రావడానికంటె ముందే ఇంటినుంచి బయటకు వెళ్లిపోయి మొహం చాటేశారుట. విశాఖపట్నంలో కార్యక్రమం చూసుకుని ఈ రాయబారుల బృందం బయలుదేరినప్పుడే… వార్త లీక్ అయింది. రంగారావు వీరిని కలవడం ఇష్టంలేక చల్లగా జారుకున్నారు. తీరా వీరు వెళ్లేసరికి, ఆయన లేరనే కబురు తెలిసింది. చివరికి ఫోనులో మాట్లాడడానికి కూడా అందుబాటులోకి రాలేదని సమాచారం.
భూమానే అంతో ఇంతో గౌరవంగా స్పందించారని.. ఈ బొబ్బిలిరాజులు మరీ టూమచ్‌గా అవమానించారని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకసారి వైకాపా వద్దనుకున్న తరువాత.. ఇక వారికి ఏమాత్రం మన్నన గౌరవం దక్కుతుందో ఈ ఉదాహరణతో తెలుస్తున్నదని పలువురు అంటున్నారు.