ఇది ముద్రారాక్షసం వంటి ప్రసంగరాక్షసం. ప్రసంగంలో మాట తూలి తమ సొంత పార్టీ అధినేత గురించి జనం నవ్వుకునేలా మాట్లాడిన సందర్భం. అవును మరి ‘జయంతి’ అంటేనే మరణించిన నేతలకు సంబంధించి జరుపుకునే పుట్టినరోజు వార్షిక వేడుక అయినప్పుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తన ప్రసంగంలో నొక్కి వక్కాణించడం సభికులకు నవ్వు తెప్పించక మరేం చేస్తుంది.
విజయవాడలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తదితరులందరూ పాల్గొన్నారు. జూపూడి మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో చాలా మంది ప్రముఖులు పుట్టారంటూ కీర్తించారు. బాబూ జగ్జీవన్ రాం, అంబేద్కర్, మహాత్మా ఫూలే వీరంతా పుట్టారని వీరి జయంతులను మనం ఘనంగా జరుపుకుంటున్నాం అని అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జయంతిని కూడా జరుపుకోవాలని ఆయన అభిలషించారు. సభికులు ఫక్కున నవ్వడంతో తన ప్రసంగంలో దొర్లిన పొరబాటు ఏమిటో జూపూడికి అర్థం అయింది. ఆ వెంటనే పదాలను చక్కదిద్దుకుంటూ చంద్రబాబునాయుడు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవాలంటూ అందరికీ పిలుపు ఇచ్చారు. అధినేతను కీర్తించి ప్రసన్నం చేసుకోవచ్చుననే దుగ్దలో నోరుజారి నవ్వులపాలు అయిన జూపూడి ప్రయాస గమనించి, చంద్రబాబు కూడా చిరునవ్వులు చిందించడం విశేషం.