ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్ర ప్రజలకు ఒక వాగ్దానం చేసారు. వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ప్రజలు తనకు మళ్ళీ మరొక్కసారి అవకాశం ఇస్తే ఇంక విగ్రహాలు, స్మారక మందిరాలు కట్టకుండా రాష్ట్రాభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
“మహనీయులకు విగ్రహాలు (అందులో తన విగ్రహాలు కూడా పెట్టించుకొన్నారు) ఏర్పాటు చేసే పని అప్పుడే పూర్తి చేసాను. అందులో తప్పేముందో తెలియదు కాని మా రాజకీయ ప్రత్యర్ధులు అదేపనిగా మమ్మల్ని విమర్శిస్తుంటారు. మళ్ళీ నేను నెలకొల్పిన ఆ స్మారక విగ్రహాలున్న పార్కులకి టికెట్లు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొంటున్నారు. బలహీన వర్గాల కోసం కృషి చేసిన కాన్షీరాం విగ్రహం పక్కన నా విగ్రహం పెట్టుకోవడాన్ని తప్పు పడుతున్నారు. ఆయనలాగే నేను కూడా నా జీవితాన్ని బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితం చేసాను కనుక నేనే ఆయన వారసురాలినని ప్రజలకు తెలిసేందుకే ఆయన విగ్రహాల పక్కన నా విగ్రహాలు కూడా పెట్టించుకొన్నాను. దానిని నేను తప్పుగా భావించడం లేదు. ఇంకా పార్కులలో వరుసగా ఏనుగు బొమ్మలు పెట్టడం ప్రజలకి స్వాగతం పలుకుతున్నట్లు సూచించడానికే తప్ప ఏనుగు మా బి.ఎస్.పి. గుర్తు అని కాదు. స్మారక విగ్రహాల ఏర్పాటు పని అప్పుడే పూర్తి చేసాను కనుక ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించనవసరం లేదు. కనుక ఈసారి ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించి పని చేస్తానని హామీ ఇస్తున్నాను,” అని మాయావతి అన్నారు.
ఆమె చెప్పిన ఈ మాటలలోనే ఆమె చేసిన పొరపాటు ఏమిటో అర్ధం అవుతోంది. ఈ మాటలను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వింటే బాగుంటుందేమో కదా?