అంచనాలు మించిపోయే సినిమా అవుతుందనుకొంటే.. అందర్నీ ‘ముంచేసిన’ సినిమాగా మిగిలిపోయింది సర్దార్ గబ్బర్ సింగ్. రిలీజ్‌కి ముందు ఈ సినిమాకి వచ్చిన హైప్ చూసి.. బయ్యర్లు క్యూ కట్టారు. పది రూపాయలు ఇవ్వాల్సిన చోట… పదిహేనిచ్చి సినిమాని కొన్నారు. తీరా చూస్తే.. రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. నైజాంలో పవన్ కల్యాణ్‌కి తిరుగులేని మార్కెట్ ఉంది. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది నైజాంలో రికార్డు వసూళ్లు సృష్టించాయి.
ఆ ధైర్యంతో ఇంద్ర ఫిలిమ్స్ అనే డిస్టిబ్యూషన్ సంస్థ సర్దార్ని రూ.20 కోట్లకు కొనేసింది. ఇప్పుడు నైజాంలో పది కోట్లు కూడా రావడం లేదు. ఇటీవల నైజాంలో ఇంత తీవ్రమైన నష్టం ఎదుర్కొన్న సినిమా ఇదొక్కటేనట. చాలా ఏరియాల్లో సేమ్ ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే డిస్టిబ్యూటర్లు తెలివిగా థియేటర్ల వారీగా సినిమాని అమ్ముకొన్నారు. అలా అమ్ముకొన్నవాళ్లంతా ఇప్పుడు సేఫ్. మిగిలినవాళ్లే ఇప్పుడు పవన్ వైపు దీనంగా చూస్తున్నారు. ఆదుకోమని. అందులో నైజాం తొలి స్థానంలో ఉంటుంది.