డబ్బు, పలుకుబడి మైకం కమ్ముకున్న వాళ్లకు మంచి మాటలు వినిపించవు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా అలాగే వ్యవహరిస్తోంది. సంస్కరణలపై లోధా కమటీ చేసిన సిఫార్సుల అమలుకు బోర్డు పెద్దలు విముఖంగా ఉన్నారు. ముఖ్యంగా, బోర్డు వేలకోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల్లో గోల్ మాల్ జరగకుండా చూడటానికి కమిటీ కీలక సూచన చేసింది. కాగ్ సూచించిన ఆడిటర్ ను బోర్డులో సభ్యుడిగా నియమించాలనేది ఈ సూచన. దీనికి బోర్డు ఒప్పుకోవడం లేదు. అంటే, ఏదో గోల్ మాల్ జరుగుతోందనే అనుమానం కలగడం సహజం.
లోధా కమిటీ సిఫార్సులను ఎందుకు ఒప్పుకోవడం లేదని సుప్రీం కోర్టు బీసీసీఐని సూటిగా ప్రశ్నించింది. అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి మాత్రం మంచి బుద్ధి రావడం లేదు. రాజకీయ నాయకులు బోర్డును ఎందుకు నడుపుతున్నారనే బోర్డు ప్రశ్నకుకూడా జవాబు లేదు. అలాగే, ఒక రాష్ట్రం నుంచి ఒకటేఓటు అనే సూచనకూ బోర్దు పెద్దలు ఒప్పుకోవడం లేదు.
అసలు బోర్డు వ్యవహారమే అడ్డగోలుగా ఉందనే విషయాన్ని కోర్టు గుర్తించింది. అందుకే, దీన్ని ప్రభుత్వ ఆధీనంలోకి ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వమే బోర్డును నడిపితే అభ్యంతరం ఏమిటనే ప్రశ్నకు క్రికెట్ బాస్ లు నీళ్లునములుతున్నారు. చాలా కాలంగా రాజకీయ నాయకులే బోర్డును పట్టుకుని వేలాడుతున్నారు. ప్రస్తుత కార్యవర్గంలోని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా బీజేపీకి చెందిన వ్యక్తి. పైగా పార్లమెంటు సభ్యుడు.
వేలకోట్ల రూపాయల ఆదాయం ఉన్న బోర్డులో గోల్ మాల్ జరుగుతోందనే అనుమానం చాలాకాలంగా ఉంది. సరైన ఆడిటింగ్ లేదు. శశాంక మోహన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పారదర్శకత, జవాబుదారీ తనం, పక్కాగా ఆడిటింగ్ వగైరా ఎన్నోసుద్దులు చెప్పారు. చివరకు తాను కూడా ఆ తాను ముక్కేఅన్నట్టుగా మారిపోయారు.
దుర్భర కరువుతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం మైదానాల నిర్వహణకు పెద్ద మొత్తంలో నిళ్లు ఉపయోగించాలి. లాతూర్, తదితర ప్రాంతాల్లో దాహంతోప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నప్పుడు మ్యాచ్ లను వేరేరాష్ట్రానికి తరలించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. క్రికెట్ బోర్డు పెద్దలు మాత్రం డబ్బే ప్రధానమన్నట్టు వాదించారు. పుణేలో మ్యాచ్ లకు ముంబై నుంచి రీసైక్లింగ్ నీటిని ట్యాంకర్ల ద్వారా తరలిస్తామని ప్రతిపాదించింది. లాతూర్ బాధితుల కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇస్తామని చెప్పింది. ఇక్కడ సమస్య డబ్బు కాదు. నీళ్లు.
దాహంతో ఉన్న మనిషికి నీళ్లు కావాలి. రైళ్లలో నీటిని తరలించే దుర్భర పరిస్థితుల్లో, మ్యాచ్ లను తరలిస్తే తప్పేంటి? కేవలం వినోదం కోసం ఆడే ఆట రద్దు చేసినా తప్పేంటని మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా లాతూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. బోర్డుకు కనీసం మానవత్వం లేనట్టు ప్రవర్తించే తీరు జుగుప్సాకరంగా ఉంది. సహాయం చేయకపోతే పోయె. పుండు మీద కారం చల్లినట్టు వ్యాఖ్యలు చేయడం దారుణం. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా క్రికెట్ బోర్డును పట్టుకుని వేలాడుతున్నారు. వాళ్లు గత రెండు మూడు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే మనుషులా కాదా అనిపిస్తుందని లాతూర్ ప్రాంతంలో విమర్శలు వినిపిస్తున్నాయి.