మహారాష్ట్రాలో శివసేన పార్టీ భాజపాకి మిత్రపక్షంగా, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కానీ దాని అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అప్పుడప్పుడు భాజపా, ఆర్.ఎస్.ఎస్.లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఏపిలో తెదేపా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేని భాజపా, ఆయన ఎంత తీవ్ర విమర్శలు చేసినా అసలు పట్టించుకోదు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ మనుగడ ఆయన చేతిలో ఉన్నందునే కావచ్చు.
శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో ఉద్ధవ్ థాకరే భాజపా, ఆర్.ఎస్.ఎస్, పిడిపిల గురించి ఏమని వ్రాసారంటే న్నారంటే “జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం భారత్ తో కంటే వేర్పాటువాదులవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లుంది. ఆ రాష్ట్రంలో పిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపా కూడా ఎంతసేపు తన అధికారాన్ని కాపాడుకోవడం పైనే దృష్టి పెడుతోంది తప్ప శ్రీనగర్ లో పెరుగుతున్న భారత వ్యతిరేకత, ఐసిస్, పాక్ జెండాల రెపరెపలను పట్టించుకోవడం లేదు. జాతీయవాదం తన సొత్తు అన్నట్లుగా మాట్లాడుతున్న ఆర్.ఎస్.ఎస్. నేతలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తమ అతివాదాన్ని వదులుకోవాలి. 50 లక్షలు జనాభా ఉన్న ప్రాంతాలను రాష్ట్రాలుగా విభాజించాలన్న దాని వాదన ఎంత ప్రమాదకరమో దానికి తెలియడం లేదు. ఒకసారి భారత్ ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొడితే ఇంక భారత్ విచ్చిన్నం కావడానికి ఎంతో సేపు పట్టదు. గత ప్రభుత్వంతో పోల్చితే ఇప్పటి ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి,” అని ఉద్ధవ్ థాకరే అన్నారు.
భారత్ కంటే చైనా, ఇజ్రాయిల్ దేశాలే చాలా వేగంగా అభివృద్ధి చెందాయన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలకి జవాబిస్తూ “ఆ రెండు దేశాలు భారత్ కంటే ఎందుకు ఎక్కువ అభివృద్ధి చెందాయంటే అవి ఏనాడూ జాతీయవాదంపై రాజీ పడలేదు. ఆ రెండు దేశాలు దేశద్రోహులతో రాజీ పడలేదు..ఎన్నడూ వారిని ఉపేక్షించలేదు. తమ దేశంలో జాతి వ్యతిరేక నినాదాలను, ఆలోచనలను చివరికి జెండాల ప్రదర్శనను కూడా అవి ఉక్కుపాదంతో అణచివేసాయి. అందుకే అవి అంతగా అభివృద్ధి చెందాయి. కానీ మనదేశంలో రాజకీయ లబ్ది ఉంటుందంటే దేశాని విచ్చినం చేయజూసే శక్తులతో కూడా చేతులు కలిపే వాళ్ళున్నారు. అదే మనకి ఆ దేశాలకి ఉండే తేడా,” అని ఉద్ధవ్ థాకరే చురకలు వేశారు. అది మోహన్ భగవత్ ను ఉద్దేశ్యించి అన్నవే అయినా జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాదులకు మద్దతునిచ్చే పిడిపితో భాజపా స్నేహం చేస్తునందుకేనని చెప్పవచ్చు.