తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఫ్లోర్ లీడర్ కుందూరు జానారెడ్డికి అజాత శత్రువుగా పేరుంది. ఆయన పేరుకు ప్రధాన ప్రతిపక్షానికి సభా నాయకుడు గానీ.. నిజం చెప్పాలంటే.. చాలా అంశాల్లో పాలకపక్షం వారికి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అఫ్ ది రికార్డ్ సంభాషణల్లో అయితే.. కేసీఆర్ సర్కారు బాగానే పనిచేస్తున్నదని చెబుతూ ఉంటారు. అందుకే తెరాస మంత్రులు, కేసీఆర్ అందరూ కూడా సభలో జానారెడ్డిని చాలా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు. అలాంటి అజాత శత్రువుకు కూడా తాజాగా కోపం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీనుంచి తెరాసలోకి మళ్లీ వలసలు మొదలు కావడాన్ని జానారెడ్డి సహించలేకపోతున్నట్లున్నారు. చిట్టెం రామ్మోహనరెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో తెరాస ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని భయంకరంగా తుంగలో తొక్కేస్తున్నారని, తెరాస సర్కారు వైఖరిపై సుప్రీం కోర్టులో తాము పిటిషన్ వేస్తాం అని జానారెడ్డి తెరాసను హెచ్చరిస్తున్నారు.
అసలే పాపం టీపీసీసీ నాయకులు చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో పార్టీ నాయకత్వం వీరికి చేతకావడం లేదని ఫిక్సయిపోయినట్లుగా పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఒక కన్సల్టెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. 12వ తేదీన హైదరాబాదుకు వచ్చిన దిగ్విజయసింగ్.. స్థానిక పార్టీ నాయకులకు సరిగా పనిచేయడం లేదంటూ తలంటు పోసి వెళ్లినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో నాయకులు ఎందుకు పార్టీ వీడి పోతున్నారో సమీక్షించుకోవాలని, రాష్ట్ర నాయకత్వంలో లోపాలు ఉన్నాయని వీహెచ్ వంటి సీనియర్లు కంటినలుసులాగా సతాయించేస్తూ ఉన్నారు.
ఇన్ని రకాల అసహనాల మధ్య చిర్రెత్తిపోయిన జానారెడ్డి తీవ్రంగా విరుచుకుపడడం ఆశ్చర్యకరం. అయితే ఆయన సుప్రీం కోర్టు దాకా కేసును ఎంత సీరియస్‌గా తీసుకెళ్తారో వేచిచూడాలి.