కల్వకుంట్ల చంద్రశేఖర రావు శైలే వేరు. ఆయన ఏ విషయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. తాజాగా అంబేద్కర్ విగ్రహంలోనూ అంతే. సాధారణంగా తన ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడిన వాళ్లదే తప్పు అన్నట్టు కేసీఆర్ దబాయించగలరు. తన కేబినెట్లో ఎస్టీలకు చోటు లేకపోయినా పరవా లేదంటారు. దాదాపు నాలుగున్నర కోట్ల జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. అయినా, ఆయన, ఆయన కేబినెట్లో ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదు. అదే కరెక్టని బల్లగుద్ది వాదించం కేసీఆర్ కే సాధ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లయినా, మంత్రి పదవి నిర్వహించే అర్హతలు గల మహిళ ఒక్కరు కూడా ఆయన పార్టీలో కనిపించలేదా? మహిళా ఎమ్మెల్యేలలో అందరూ అసమర్థులే అని ఫిక్స్ అయ్యారా?
ఇప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. 125వ జయంతి కాబట్టి 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సంకల్పించారు. ఎన్టీఆర్ సమాధి పక్కనే విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన చేసేశారు. దీంతో దళితుల అభ్యున్నతి జరిగి పోయిందని భావించాలో ఏమో అర్థం కాదు. కనీసం ఈ సందర్భంగానైనా లోటు భర్తీ చేస్తారని బావించిన వారు తప్పటడుగు వేశారని మరోసారి రుజువైంది.
దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న మనిషి, మాట తప్పినా తప్పు కాదంటారు. పైగా ఈ విషయంలో విమర్శించే వాళ్లను సన్నాసులని తిట్టగలరు. డాక్టర్ అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా జరిపితే అంత గొప్ప. ఇదో రకం ఓటు బ్యాంకు రాజకీయం. అమరావతిలో అంబేద్కర్ భారీ విగ్రహ ప్రతిష్టాపనకు ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించారు. తానెందుకు వెనకబడాలని కేసీఆర్ భావించినట్టున్నారు. ఆగమేఘాల మీద 125 అడుగుల విగ్రహానికి శంకుస్థాపన నిర్ణయం తీసుకున్నారు.
అణగారిన వర్గాలు బాగుపడాలని అంబేద్కర్ భావించారు. ఆ వర్గాల్లో ఎస్టీలు కూడా ఉన్నారు. కేసీఆర్ మాత్రం ఎస్టీల ఊసే ఎత్తడం లేదు. మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వకూడదని అంబేద్కర్ ఏనాడూ చెప్పలేదు. కేసీఆర్ మాత్రం తన కేబినెట్లో ఇంత వరకూ మహిళలకు చోటు ఇవ్వలేదు. ఇప్పుడు హటాత్తుగా సామాజిక న్యాయం, దళిత జనోద్ధరణ అంటూ అంబేద్కర్ భారీ విగ్రహం పెడితే సరిపోతుందా? దళితులకు భూమి కావాలి. ఉద్యోగాలు కావాలి. పేదరికం పోవాలి. సొంత ఇల్లు కావాలి. తిండికి లోటు లేని జీవితం కావాలి. కేవలం అంబేద్కర్ భారీ విగ్రహ ప్రతిష్టాపనకు భారీగా ప్రజల సొమ్మును ఖర్చుపెట్టి, మీ జీవితాలను ఉద్ధరించాం అన్నట్టు పోజు కొట్టడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. వచ్చింది ప్రజల తెలంగాణ కాదు దొరల తెలంగాణ అని కొందరు మేధావులు, ప్రజా కళాకారులు అన్న మాట నిజమేనేమో అనిపించేలా కేసీఆర్ పనితీరు ఉంకూడదు. ఆ విమర్శలు నిజం కాదనేలా పనిచేయాల్సింది. కులం ఏదైనా ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టాలి. అలాంటి అసలు సిసలైన నిబద్ధతతో ఆయన పనిచేస్తేనే విశ్వసనీయత పెరుగుతోంది. విగ్రహం అనేక ఓ సింబాలిక్ చర్య మాత్రమే. అణగారిన వర్గాలకు సింబాలిక్ బుజ్జగింపులు సరిపోవు. నిజంగా, నిబద్ధతతో మేలు చేయడం కావాలి.