మన రాష్ట్రంలో పాదయాత్ర అంటే ఎవరైనా సరే ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేరునే ప్రస్తావిస్తారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజ్యం చేస్తున్న సమయంలో అతి పెద్ద పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డు సృష్టించారు. ఈ తర్వాత 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబునాయుడు ఒకరి జాడల్లో తాను నడవకూడదని కోరుకునే వ్యక్తి అయినప్పటికీ.. ఈ మంత్రం ఆయన మీద బాగా పనిచేసింది. 2014 ఎన్నికలకు ముందు ఆయన కూడా పాదయాత్రల బాట పట్టారు. అనంత పురం నుంచి ప్రారంభించి పాదయాత్ర చేసి.. ఏకంగా అధికారంలోకి వచ్చారు. ఇలా నాయకులు పాదయాత్రలు చేయడం.. మనకు రివాజే. ఇప్పుడు ఈ అగ్ర నాయకులు అనుసరించిన ఈ మార్గమే.. తెలంగాణకు తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అనుకుంటూ కాలంగడిపే తెదేపా ఫ్లోర్ లీడర్ రేవంత్‌రెడ్డికి కూడా దిక్కవుతున్నట్లుగా ఉంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఇంతకంటె మరో మార్గం లేదని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు సుదీర్ఘమైన పాదయాత్ర చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
పాదయాత్ర అంటే ఏదో కాస్త మందిని తన వెంట పోగేసుకుని.. రోడ్లమ్మట నడుచుకుంటూ వెళ్లిపోవడం మాత్రమే కాదు. నడుస్తున్న దారిపొడవునా ప్రజల్ని ప్రభావితం చేయగల, తమ సిద్ధాంతాలు, తమ పోరాటాల పట్ల ప్రజల్ని ఆకర్షించగల, వారిలో ఆలోచనను రేకెత్తించగల నాయకులు మాత్రమే పాదయాత్రలు చేస్తే దాని ఫలితం రాజకీయంగా కూడా వారికి లభించే అవకాశం ఉంటుంది. తాను కూడా పాదయాత్ర చేయాలని అనుకునే ముందు రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
ఏది ఏమైనప్పటికీ.. రేవంత్‌రెడ్డి కి ఒక రకంగా పాదయాత్ర ఎడ్వాంటేజీ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్‌ను చెడామడా తిట్టే వ్యక్తిగా తప్ప రాష్ట్ర వ్యాప్త నాయకుడిగా ఆయనకు ఇప్పటిదాకా ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ఎంతవరకు పాలమూరు జిల్లా నాయకుడిగా మాత్రమే గుర్తింపు ఉంది. ఈ పాదయాత్ర అంటూ చేస్తే గనుక.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రజల దృష్టిలో నాయకుడిగా ముద్ర పడవచ్చు. ఆ తర్వాత ఆయన ఎంత శ్రమిస్తారు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకువెళ్తారు అనేదానిని బట్టి రాజకీయంగా లాభపడడం జరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.