వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలోకి వలసలు మహ జోరుగా సాగుతూ ఉన్నాయి. ఇంకా బోలెడు వలసలు ఉన్నాయి అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విడతలో కనీసం 6గురికి పైగా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒకే కానీ.. హఠాత్తుగా ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇలా వలసలు జోరందుకున్నాయి. రెండేళ్లుగా అంతా మౌనంగానే ఉన్నారు కదా.. హఠాత్తుగా ఎందుకు ఇప్పుడే ఇంత జోరుగా అందరికీ ఎర వేయడమూ, ఆహ్వానించడమూ.. ఇదంతా జరుగుతోంది అనే సందేహాలు ఎవరికైనా కలగడం సహజం. ఈ జోరు అంతా త్వరలో రాష్ట్రంలో జరగబోతున్న రాజ్యసభ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మాత్రమే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కోటాలో ఎన్నికైనా నలుగురు రాజ్యసభ సభ్యుల కోటా మరి కొన్నాళ్లలో ముగియబోతోంది. అంటే ఎమ్మెల్యేల కోటాలో నాలుగుస్థానాలకు రాష్ట్రంలో ఎన్నిలు జరిగే అవకాశం ఉంది. ఈ నాలుగు స్థానాల్లో తెలుగుదేశానికి ఒక్క సీటు దక్కకుండా చేయడానికి, అన్నిటినీ తామే క్లీన్ స్వీప్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
ఒక్కొక్క సీటును దక్కించుకోవడానికి కనీసం 42 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలనేది అంచనా. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అంతకంటె ఎక్కువమంది సభ్యులే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఒక ఎంపీ సీటు దక్కుతుంది. అయితే.. వైకాపా బలం 42 సీట్ల కంటె దిగువకు పడిపోయేంత వరకు ఆకర్ష మంత్రాన్ని జోరుగా ప్రయోగించాలని టీడీపీ తహతహ లాడుతున్నది. తద్వారా ఏపీలో వైకాపాకు ఠికానా లేని రోజులు వచ్చాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసకువెళ్లాలనేది బాబు వ్యూహంగా చెబుతున్నారు. అదే జరిగితే మరి వైకాపా అధినేత జగన్ ఎలాంటి ప్రత్యామ్నాయ వ్యూహంతో ముందుకు వస్తాడో.. తన పార్టీని కాపాడుకోవడానికి కనీసం తనను నమ్ముకున్న సీనియర్లలో ఒకరినైనా రాజ్యసభకు పంపడానికి ఏం చేస్తారో చూడాలి.