తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్యని అందింస్తామనే హామీ ఇచ్చేరు. కానీ ఇంతవరకు దానిని అమలు చేయకపోవడంతో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేసారని విమర్శిస్తున్నాయి. వారి విమర్శలకి భయపడి తెలంగాణా ప్రభుత్వం హడావుడిగా ఆ పధకం మొదలుపెట్టడానికి సిద్దం కాలేదు. మొదలుపెట్టి ఉండి ఉంటే అనేక ఇతర పధకాలలాగే అది కూడా మధ్యలోనే ఆగిపోయేది. ఆ పధకం అమలు చేయడానికి ముందు దాని సాధ్యాసాధ్యాలు, అవసరమయిన నిధులు, ఏర్పాట్లు అన్నిటిపై తెలంగాణా ప్రభుత్వం చాలా లోతుగా అధ్యయనం చేసింది.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలో ‘కేజీ టు పిజీ’ పధకాన్ని అమలుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ జూన్ నుంచే రాష్ట్రంలో మొత్తం 250 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, వాటికి ఉపాద్యాయులను నియమించబోతున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యలు అభ్యసించాలనుకొంటున్న దళిత విద్యార్దీ, విద్యార్దునుల కొరకు సాంఘిక సంక్షేమ శాఖ అధ్వర్యంలో రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
తెరాస రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం అనేక పధకాలను చేపట్టి వాటిని శరవేగంగా అమలుచేస్తోంది. వాటిపై రాష్ట్రమోని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ, తెరాస పార్టీతో ఎటువంటి సంబంధాలు లేని ఎన్డీయే ప్రభుత్వం కూడా వాటిని మెచ్చుకొని అవసరమయిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. వాటి వలన మరికొన్నేళ్ళలో తెలంగాణా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, భగీరధ వంటి పధకాలు దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ప్రారంభించబోయే ఈ ‘కేజీ టు పిజీ’ పధకం కూడా విజయవంతంగా అమలుచేయగలిగితే తెరాస ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.
సమాజంలో నిరుపేద విద్యార్ధులకు చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ప్రతీ ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తూ చాలా కాలంగానే ఉచిత విద్యా, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కానీ వాటికి ఆ పనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో దాని వలన ఆశించిన ఫలితాలు సాధించాలేకపోతున్నాయి. అందుకే నేటికీ సమాజంలో బలహీన వర్గాల పిల్లలు విద్యకు నోచుకోవడం లేదు. ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే గమనించినట్లున్నారు. అందుకే దానికి పరిష్కారంగా ఈ కేజీ టు పిజీ పధకాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా భావించవచ్చు.