తొంభైఏళ్ళ ముఖ్యమంత్రి మనకి అవసరమా అని అస్సాం ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్రమోదీ లేవనెత్తిన ప్రశ్న బిజెకి అనుకూలిస్తుందో బెడిసికొడుతుందో తెలియదుకాని అక్కడ బిజెపిని తరుముతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ వయసు 82 ఏళ్ళన్న విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. మన పొరుగు రాష్ట్రాలైన కేరళలో 93 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, తమిళనాడులో 94 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి
వారివారి రాజకీయ ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారు.
ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి పదవి రేసులో వుండడం విశేషం. వీరు ముగ్గురూ ముఖ్యమంత్రులుగా ఎన్నికైతే 65 శాతం మంది 45 ఏళ్ళలోపువారే వున్న భారతదేశంలో ఓ అరుదైన రికార్డే అవుతుంది.
1931లో పుట్టిన తరుణ్ గొగాయ్ వయస్సు 81 ఏళ్లు. ఈయన సోషల్ మీడియాద్వారా ప్రజలతో మాట్లాడటం ఈమధ్యే మొదలు పెట్టారు. దివంగత రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగాయ్ అస్సాంలో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ని గెలిపించి, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.2011 ఎన్నికలకు ఆరు నెలల ముందే తనకు హార్ట్ సర్జరీ అయిన్నప్పటికీ ప్రచారాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం విశేషం.
93 ఏళ్ల అచ్యుతానందన్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుంది. 1967లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అచ్యునందన్ ఒకసారి ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.1996 ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ సిఎం అభ్యర్ధిగా రంగంలోకి దిగిన్నప్పటికీ, తమ కూటమికే మెజార్టీ దక్కిన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవి మిస్ అయ్యారు. ఆ తర్వాత 2006లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్యుతానందన్ ఇప్పుడు మరోసారి పోటీపడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే అచ్యుతానందన్ కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు 30 ఏళ్ల కుర్రాడిలా ఆయన హ్రుదయం పనిచేస్తోందంటూ కితాబివ్వడం విశేషం. మండుటెండల్లో యువకులతో పోటీ పడి ప్రచారంలో పాల్గొంటున్న అచ్యుతానందన్ రోజుకి కనీసం అయిదారు సభల్లో ప్రసంగిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో తలపండిన కరుణానిధి 20 ఏళ్ల చిన్న వయస్సులోనే సినిమా స్క్రిప్టు రైటర్ గా సంచలన విజయం సాధించిన కరుణానిధి రాజకీయాల్లోనూ గాఢమైన ముద్ర వేశారు. ఇప్పుడు కరుణానిధి వయస్సు 94 ఏళ్లు. 75 సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన కరుణానిధి అయిదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 ఏళ్లకు మించిన రాజకీయ అనుభవం వున్నవాడు. తనకు మాదిరిగానే అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితను ఓడించి, ఆరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డును తన సొంతం చేసుకోవాలన్నది ఈ పెద్దమనిషి పంతం. 2009 లో స్పైనల్ సర్జరీ చేయించుకున్న కరుణానిధి వీల్ చైర్ లోనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతుండడం విశేషం.
ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వారసత్వంగా సంక్రమించిన జన్యు శక్తి, సంకల్పబలం,…వయోభారంలోనూ వీరి తరగని ఉత్సాహానికి మూలాలు. కరుణానిధి యోగా చేస్తారు. నాలుగున్నరకే నిద్ర లేవడం, గంట సేపు యోగా, ముప్పై నలభై నిమిషాలు వాకింగ్ అచ్యుతానందన్ కి అలవాటు. తరుణ్ గొగాయ్ మార్నింగ్ వాక్ ఏస్ధితిలోనూ ఆగదు.
అచ్యుతానందన్ మినహా మిగిలిన ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నారు. ట్విట్టర్ లో @kalaignar89 హాండిల్ మీద కరుణానిధిని, @tarun_gogoi హాండిల్ మీద తరుణ్ గోగాయ్ ని చదవవచ్చు! ప్రశ్నించవచ్చు!