బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పాస్ పోర్ట్ ఈరోజు నుంచి తాత్కాలికంగా రద్దు (సస్పెండ్) చేయబడింది. ఈడి అధికారుల విజ్ఞప్తి మేరకు విజయ్ మాల్యాకి జారీ చేసిన దౌత్య హోదా గల పాస్ పోర్ట్ ని సెక్షన్:10 (ఏ) క్రింద 4 వారాలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు డిల్లీలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. అంతేకాక సెక్షన్: 10 (3) (సి) ప్రకారం ఆయన పాస్ పోర్ట్ ని శాస్వితంగా రద్దు చేయాలనుకొంటున్నట్లు ఆయనకి తెలియజేస్తూ ఒక నోటీస్ కూడా పంపించింది. ఈ విషయంలో ఆయనకి ఏమయినా అభ్యంతరాలున్నట్లయితే వారం రోజులలోగా సమాధానం పంపవలసిందిగా ఆ నోటీసులో కోరింది. ఆలోగా ఆయన నుంచి తమకు సంతృప్తికరమయిన సమాధానం అందనట్లయితే, ఈ విషయంలో ఆయనేమీ చెప్పుకోదలచలేదని భావిస్తూ పాస్ పోర్ట్ ని శాస్వితంగా రద్దు చేస్తామని తెలియజేసింది.
విజయ్ మాల్యాపై ఈడి అధికారులు మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, ఆ కేసులో ప్రశ్నించడానికి తమ ముందు హాజరు కావలసిందిగా ఆయనకి మూడుసార్లు నోటీసులు పంపించారు. కానీ విజయ్ మాల్యా తనకు ఇంకా సమయం కావాలని కోరుతూ ఈడి ముందు హాజరుకాకుండా లండన్ లోనే ఉండిపోయారు.
ఈడి అధికారులు ఆయన పాస్ పోర్ట్ ని రద్దు చేయవలసిందిగా కోరుతూ డిల్లీలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి ఒక లేఖ వ్రాసింది. దానికి వెంటనే స్పందించి ఆయన పాస్ పోర్ట్ ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యుడు కనుక ఆయనకు దౌత్య హోదా గల పాస్ పోర్ట్ కలిగి ఉన్నారు. ఇప్పుడు అది తాత్కాలికంగా సస్పెండ్ చేయబడింది కనుక ఇక నుంచి చాలా ఆసక్తికరమయిన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.