హైదరాబాద్: సరిగ్గా ఐదురోజుల క్రితం జార్ఖండ్ మహిళామంత్రి నీరా యాదవ్ ఒక కార్యక్రమంలో అబ్దుల్ కలామ్ ఫోటోకు దండవేసి దండాలు పెట్టటం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంకావటం తెలిసిందే. ఇప్పుడు అది నిజమవటం సంచలనం సృష్టించింది. దీనిపై సోషల్ మీడియాలో ఇంకా పెద్ద వివాదమయింది. ఆమె అలా చేయటంవలనే కలామ్ చనిపోయారని కొందరు, ఆమె భవిష్యత్తు చెప్పగలిగిన ఫ్యూచరిస్ట్ అని మరికొందరు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆ మంత్రి నీరాయాదవ్ కలామ్ మృతివార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తాను కలామ్‌ను గురువులాగా పరిగణిస్తానని, ఆరోజు కలామ్ ఫోటోకు తాను ఉద్దేశ్యపూర్వకంగా దండవేయలేదని, కేవలం గౌరవించటంకోసమే అలా చేశానని అది పొరపాటేనని అన్నారు.
విద్యాశాఖమంత్రిగా ఉన్న నీరాయాదవ్ జార్ఖండ్ రాష్ట్రంలోని కోడెర్మా పట్టణంలోని ఒక పాఠశాలలో స్మార్ట్ క్లాసులు ప్రారంభించే కార్యక్రమంలో కలామ్ ఫోటోకు దండవేశారు. కాగా, ఆమె కలామ్ ఫోటోకు దండవేసి బొట్టు పెడుతుండగా పక్కనున్నవారెవరూ అభ్యంతరం చెప్పకపోవటం విశేషం. కలామ్‌కు బొట్టుపెట్టి దండవేసిన ఫోటోలు సోషల్ మీడియాకు చేరటంతో అది పెద్ద వివాదమయింది. దీనిపై నీరా యాదవ్ నాడు స్పందిస్తూ, పెద్ద పెద్ద నేతల ఫోటోలకు దండలువేయటం సహజమేనని, అది గౌరవంతో చేస్తామని సమర్థించుకున్నారు.