రాజకీయ నేతలు కొన్నిసార్లు నోరు జారడం, తరువాత ఉపసంహరణలు, క్షమాపణలు చెప్పుకొని బయటపడటం చూస్తూనే ఉంటాము. అలాగే ధోనీ వంటి ప్రముఖులు దేవతామూర్తుల రూపంలో పోస్టర్లకి, పత్రికలకి ఎక్కి తలబొప్పి కట్టించుకోవడం కూడా అపుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఉత్తరప్రదేశ్ లో అటువంటిదే పునరావృతం అయింది.
ఆ రాష్ట్రానికి ఇటీవలే కేశవ్ మౌర్యా భాజపా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వారణాసికి చెందిన రూపేష్ పాండే అనే భాజపా నేత ఒకరు తమ కొత్త నాయకుడిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ బ్యానర్ వివాదాస్పదమయింది. అందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ద్రౌపదిగా చిత్రీకరించి, రాహుల్ గాంధి, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రి అజాం ఖాన్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ప్రతిపక్ష నేత మాయావతి ఐదుగురినీ దుశ్శాసనులుగా చూపించి, వారు ఐదుగురు కలిసి ద్రౌపదీ వస్త్రాపహరణం చేస్తున్నట్లు పోస్టర్లో చూపించారు.
వారి బారి నుండి ద్రౌపది (ఉత్తరప్రదేశ్)ని కాపాడటానికే వచ్చిన శ్రీకృష్ణుడు కేశవ్ మౌర్యా అన్నట్లు ఆ పోస్టర్ లో చిత్రీకరించారు. విష్ణుచక్రం ధరించి శ్రీకృష్ణావతారంలో ఉన్న కేశవ్ మౌర్యాని ఉద్దేశ్యించి “రక్షమామ్ కేశ్” అంటూ ద్రౌపది మొరపెట్టుకొంటున్నట్లు చిత్రీకరించారు.
వారణాసిలో కొన్ని ప్రధాన కూడళ్ళలో ప్రత్యక్షమయిన ఈ పోస్టర్ చాలా కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కినందుకు ఎంతో సంతోషిస్తూ భాద్యతలు స్వీకరిస్తే మొట్టమొదటిరోజే కేశవ్ మౌర్యాకి చేదు అనుభవం ఎదురవడంతో కంగు తిన్నారు. వెంటనే తేరుకొని ఆ పోస్టర్లతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించేసి చేతులు దులుపుకొన్నారు.