విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కోరుతూ వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో మూడవ రోజుకి చేరుకొంది. ఉత్తరాంధ్రా జిల్లాల వైకాపా నేతలు, అంబటి రాంబాబు, సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలందరూ వచ్చి ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.
అమర్నాథ్ కి సంఘీభావం తెలపడానికి వచ్చిన అంబటి రాంబాబు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటుగా విమర్శలు చేసారు. “రైల్వే జోనే సాధించలేని ముఖ్యమంత్రి ఇంక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమి సాధించగలరని ఎద్దేవా చేసారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చనందుకు హోదా ఇవ్వలేకపోతున్నామని చెపుతున్న కేంద్రప్రభుత్వం, రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టిన్నప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించారు. రైల్వే జోన్ గురించి తెదేపా కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదని విమర్శించారు. తెదేపా-భాజపాలు రెండూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు.
వైకాపా ఎంపి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ “తెదేపా ప్రభుత్వం, దాని ఎంపిలు మాట్లాడకపోయినా తాము ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులను కలిసి అడిగినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అయినప్పటికీ రైల్వే జోన్ ఏర్పాటు చేసేవరకు తాము పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పారు.
సాధారణంగా వైకాపా నేతలు చేసే ప్రతీ విమర్శకి వెంటనే స్పందించే తెదేపా నేతలు, మంత్రులు ఈ దీక్ష గురించి కానీ, ఆ సందర్భంగా వైకాపా నేతలు తమపై చేస్తున్న విమర్శలపై గానీ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఇది కూడా ప్రజల మనోభావాలతో ముదిపడున్న సున్నితమయిన అంశమే కనుక ఈ విషయంలో తెదేపా నేతలు సంయమనం పాటిస్తున్నట్లున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు కూడా తెదేపా ఇదేవిధంగా వ్యహరించింది. కనుక అమర్నాథ్ దీక్షకి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ముగింపే ఇవ్వవచ్చును.