ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో చేర్చేసుకోగానే సంబరపడిపోవడానికి లేకుండా పోతోంది. విజయనగరం జిల్లాకి చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయిన త్వరలో తెదేపాలో చేరడం ఖాయం అయిపోయింది. వారిలో సుజయ కృష్ణ రంగారావుకి, మంత్రి పదవి, ఆయన సోదరుడు బేబీ నాయినకి పార్టీలో కీలక పదవి లేదా ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు సాక్షి మీడియాలో వచ్చిన వార్తలు సహజంగానే జిల్లాలోని తెదేపా నేతలకు చాలా అసంతృప్తి కలిగిస్తున్నాయి.
జిల్లాకి చెందిన సీనియర్ తెదేపా నేత, ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇంతవరకు దక్కలేదు. ఆ అసంతృప్తి ఇప్పుడు మెల్లగా బయటపడుతోంది. పార్టీలో సీనియర్ అయిన తనను పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వస్తున్న సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తల చూసి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే జిల్లాలో ఎస్. కోట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోళ్ళ లలిత కూడా ఈ వార్తలు చూసి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చేక ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చేయి కానీ కొద్దిలో ఆ అవకాశం తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె కూడా మంత్రి పదవి కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కనుక సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆమె కూడా అసంతృప్తి ప్రకటించవచ్చును.
అలాగే కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ ఇంతకాలం వైకాపాతో, బొబ్బిలి రాజులతో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వారినే చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానిస్తుండటం ఆయన కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో తెదేపాని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేసిన తనను కాదని, ఇంతకాలం తెదేపాని విమర్శించిన సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి కట్టబెడుతున్నట్లు వస్తున్న వార్తలతో ఆయన కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు.
వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరకుండా ఎలాగూ ఆపలేకపోతున్నందున, జగన్ తన చేతిలో ఉన్న బలమయిన మీడియాని ఉపయోగించుకొంటూ ఈవిధంగా తెదేపాలో అసంతృప్తిని రాజేసేప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. ఎందుకంటే సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇస్తున్నట్లు తెదేపా నేతలెవరూ సంకేతం ఇవ్వలేదు. కనీసం తెదేపాకు సానుకూలంగా ఉండే మీడియాలో కూడా ఆ ప్రస్తావన కనబడలేదు. ఒక్క సాక్షిలోనే ఆ వార్త కనబడుతోంది. అందుకే దీనిని కూడా వైకాపా కౌంటర్ వ్యూహంగా అనుమానించవలసి వస్తోంది.