ఒకప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవికి గంటా శ్రీనివాసరావు, సి. రామచంద్రయ్య సన్నిహితంగా ఉండేవారు. ఆ తరువాత మునిగిపోతున్న కాంగ్రెస్ పడవ లోంచి గంటా శ్రీనివాస రావు తెదేపాలోకి దూకేసి మంత్రి అయిపోయినా నేటికీ చిరంజీవితో సత్సంబందాలే ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు కోరినందునే ‘సరైనోడు’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని వైజాగులో నిర్వహిస్తున్నామని చిరంజీవి చెప్పారు. తమ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చిరంజీవి మంత్రి గంటా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి అప్పటి ప్రభుత్వం ఏవిధంగా ప్రోత్సాహకాలు అందించి, సౌకర్యాలు కల్పించిందో, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖపట్నంలో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి సహకరిస్తే తామంత రావడానికి సిద్దంగా ఉన్నామని చిరంజీవి సభా ముఖంగా తెలియజేసారు. అందుకు గంటా శ్రీనివాసరావు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అయితే ఆయన చిరంజీవితో తన స్నేహసంబంధాలను పునరుద్దరించుకొని మరింత బలపరుచుకోవాలనే ప్రయత్నంలోనే వైజాగులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారో లేకపోతే చిరంజీవి చెపుతున్నట్లు తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్ రప్పించాలనే ఉద్దేశ్యంతోనే చేసారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవితో ఆయన ఇంత సన్నిహితంగా మెలగడం, చిరంజీవి పాపులారిటీ మరింత పెరిగేందుకు దోహదపడే విధంగా జనసమీకరణ చేసి సహకరించడం వంటివన్నీ ఆయనపై అనుమానాలు కలిగిస్తున్నాయి.
ఆంధ్రా యూనివర్సిటీ వైస్-చాన్సిలర్ నియామకం విషయంలోను గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకోవాలని చూడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ఈ మధ్యన వారిరువురి మధ్య కొంచెం దూరం పెరిగిందని మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి.
మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలేవీ చేపట్టకపోయినా పార్టీలో తన గ్రూపుని ఏర్పాటు చేసుకొని పార్టీలో అందరికంటే సీనియర్ నేత, తోటి మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులతో ఘర్షణ పడుతుంటారనే పిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు తమ ప్రత్యర్ధ పార్టీకి చెందిన చిరంజీవితో భుజాలు రాసుకొని తిరగడంతో గంటా శ్రీనివాసరావు తెదేపాకు సరైనోడేనా కాదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.