వైకాపా ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున తెదేపాలో చేరిపోతున్న సంగతి తెలిసిందే. తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరొకడుగు ముందుకు వేసి వైకాపా మూసివేతకి డేట్ కూడా ప్రకటించేశారు. మే నెలాఖరు నాటికి వైకాపా దుఖాణం పూర్తిగా ఖాళీ అయిపోతుందని, అప్పుడు పార్టీలో జగన్ ఒక్కరే మిగిలి ఉంటారని ప్రకటించేశారు. రాష్ట్రంలో తెదేపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని ప్రకటించారు. బుద్దా వెంకన్న ఈవిధంగా చెప్పడం కొంచెం అతిశయంగా కనిపిస్తునప్పటికీ, ఆ మాటల వెనుక తెదేపా అంతర్యం స్పష్టంగా కనబడుతోంది. మే నెలాఖరికి కాకపోయినా వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో వైకాపా కనబడకుండా చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రకటించేశారు కనుక వైకాపా పూర్తిగా ఖాళీ అయ్యేవరకు తెదేపా అదే పనిమీద ఉండబోతోందని స్పష్టం అవుతోంది.
అందుకు తెదేపా డబ్బు, పదవులు ఎరగా వేస్తోందనే వైకాపా నేతల వాదనని కూడా బుద్దా వెంకన్న ఖండించారు. బొబ్బిలి రాజులు తాత ముత్తాతల కాలం నుంచే గొప్ప ధనవంతులని, అటువంటి వారిని తెదేపా డబ్బిచ్చి కొనగలదా? అని ప్రశ్నించారు. బొబ్బిలి రాజుల విషయంలో ఆయన వాదన సహేతుకంగానే ఉండవచ్చును కానీ మిగిలిన చాలా మంది ఎమ్మెల్యేలకు ఏ ప్రలోభాలు చూపకుండా తెదేపాలోకి వచ్చేస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. కొంతమంది ప్రలోభాలకు లొంగితే, మరికొందరు తమ వ్యాపారాలకు, కాంట్రాక్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణంగా తెదేపాలో చేరుతున్నారని చెప్పవచ్చును. శ్రీకాకుళం జిల్లాలో ఒక వైకాపా నేతకి చెందిన (సముద్రపు ఇసుక నుంచి ఖనిజాలు వెలికి తీసే) కంపెనీపై ఆరోపణలు రాగానే ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేయడం, ఆ తరువాత ఆ కంపెనీపై ఆరోపణలు ఆగిపోవడం గమనిస్తే అది అర్ధమవుతుంది.
అయితే వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి కేవలం తెదేపా మాత్రమే కారణం కాదు. వైకాపాలో నేతల పట్ల జగన్ వైఖరి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. “ఆయన ఎవరి మాట వినడు..ఎవరినీ ఖాతరు చేయడు..ఎవరి సలహాలు స్వీకరించడు..” అని పార్టీ వీడుతున్న వారందరూ ముక్త కంఠంతో చెపుతున్న మాట. తన తీరు వలననే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోందని అందరూ చెపుతున్నా జగన్ తన తీరు మార్చుకోలేదు పైగా చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ మార్చుకోవాలని, ఆయనకి మంచి బుద్ధి కలిగించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పడం విశేషం.