ఈ వారం విడుదలైన చిత్రాల్లో.. ఈడోరకం – ఆడోరకం డీసెంట్ మూవీ అనిపించుకొంది. అడల్ట్ కంటెంట్ ఉన్నా… కామెడీ వర్కవుట్ కావడంతో వన్ టైమ్ వాచ్ మూవీగా నిలబడిపోయింది. దాంతో ఈ సినిమాకి ప్రమోషన్ పెంచే పనిలో ఉంది చిత్రబృందం. పనిలో పనిగా మోహన్ బాబు కూడా రంగంలోకి దిగారు. తన మాటలతో… డైలాగులతో తనయుడి సినిమా ప్రమోషన్ పెంచే బాధ్యతన తన భుజాలపై వేసుకొన్నారు. “సినిమా బాగుంది.. సూపర్ హిట్.. వసూళ్లు కుమ్మేస్తున్నాయి..“ అంటూ సినిమాని ప్రమోట్ చేయడం ఓ పద్ధతి. అది అందరూ చేసేదే. మోహన్‌బాబు మాత్రం ఓ అడుగు ముందుకు వేశాడు.
”ఈ సినిమా చూద్దామనుకొంటే టికెట్లు నాకే దొరకలేదు. ఆఖరికి నిర్మాతని అడగాల్సివచ్చింది. ఆయనా చాలా ఇబ్బంది పడి టికెట్లు సంపాదించారు” అని సెలవిచ్చారు. దాంతో ఆశ్చర్యపోవడం సినీ జనాల వంతైంది. సినిమా ఎంత బాగా ఆడుతున్నప్పటికీ… మోహన్‌బాబుకీ, ఆ సినిమా నిర్మాతలకూ టికెట్లు దొరక్కుండా ఉంటాయావిడ్డూరం కాకపోతే…! మోహన్ బాబుకే దొరక్కపోతే ఇక మనకెక్కడ దొరుకుతాయిలే అని థియేటర్‌కి వెళ్లకుండానే జనం లైట్ తీసుకొంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఏమంటారు మోహన్ బాబూ..!!