- గోదావరి పుష్కరాల పై విశ్లేషణ – 1
రాజకీయాలతో సంబంధంలేని ”యోగా డే” ద్వారా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన భారత ప్రధాని నరేంద్రమోదీని చూశాక, ప్రజల్లో ఒక నిశ్శబ్ద సెంటిమెంటు అయిన గోదావరి పుష్కరాలను తనకు పేరు ప్రతిష్టలు పెంచే ఈవెంటుగా చంద్రబాబు మలచుకున్నారని రిటైర్మెంటు దగ్గరలో వున్న రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ”తొక్కిసలాటలో 27 మంది చనిపోయిన విషాదం గుర్తుల్ని చెరిపివేయడానికి ఆయన ప్లానులు ఆయన చేతిలో ఇమడలేనంతగా పెరిగిపోయాయి. ఏర్పాట్లు, ఆదేశాలు, తక్షణ నిర్ణయాలు, ఖర్చులు,అన్నీ విపరీతంగా హైప్ అయిపోయాయి. అన్ని రకాల ఏర్పాట్లపై యాత్రికుల సంతృప్తి సూచిక పది రోజుల్లో 57 నుంచి 86 శాతానికి పెరిగింది. ఇది చిన్నవిషయమేమీ కాదు. అయితే పది రూపాయల పనిని కనీసం పదిరూపాయల ఖర్చుతో అయినా చేశామా లేక వెయ్యిరూపాయల ఖర్చు పెట్టామా అన్నది కూడా మౌలికమైన విషయమే” అని ఆ అధికారి విశ్లేషించారు.
ప్లాస్టిక్ సాచెట్లను వాడకూడదన్నది ప్రభుత్వ విధానం. అయితే ”ప్రాక్టికల్ అప్రోచ్ లో పోయి లక్షలాది వాటర్ పేకెట్లు తెల్లవారేసరికల్లా తెప్పించాము” అనిముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అధికారులు ముందుగానే ప్లాన్ చేయలేదా అని అడిగినపుడు జనం అనూహ్యంగా వచ్చారు అని బదులిచ్చారు. రాజమండ్రిలో రోజుకి 30 లక్షలమంది వచ్చినా ఇబ్బంది లేదని ఆయనే చెప్పారు. ఏరోజూ అంతమంది లేరని ప్రభుత్వం ప్రకటించిన లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.
“అనూహ్యంగా జనం” అనే ముఖ్యమంత్రి మాట సమస్త పుష్కర యంతా్రంగానికీ లోపాలు కప్పిపుచ్చుకునే మంత్రంగా మారిపోయింది. ఆకస్మిక, తక్షణ నిర్ణయాల మంచినీళ్ళలా డబ్బు ఖర్చు చేయవలసి వచ్చింది. ఇవాళ పది లక్షల వాటర్ సాచెట్లు ఇచ్చాము అన్నపుడు అవి ఎక్కడినుంచి ఎప్పుడు వచ్చాయి. ఎక్కడ స్టోర్ చేశారు. ఎవరు లెక్కపెట్టారు. రాత్రికి రాత్రే ఇదంతా ఎక్కడ ఎలా పూర్తయింది అన్న ప్రశ్నలకు ” పుష్కరాలు పూర్తవనివ్వండి అన్ని ప్రశ్నలకూ సంబంధిత అధికారులు సమాధానాలు ఇస్తారు” అని ప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు పరకాల ప్రభాకర్ ఒక సందర్భంలో చెప్పారు. ”ఆ సంబంధిత అధికారులం మేమేనేమో మాకు తెలియదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మా హెడ్ డ్యూటీలో వున్నాను. నెల్లూరువాళ్ళో విశాఖ వాళ్ళో ఈ డ్యూటీ చేసి వుండవచ్చు రాజమండ్రి వాళ్ళం కాదు” అని ఒక అధికారి చెప్పారు.
ఇలాంటి గ్రౌండ్ రియాలిటీస్ ముఖ్యమంత్రి వరకూ వెళ్ళలేదు. “డిజిపి నుంచి హోంగార్డువరకూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకూ అందరి మధ్యా ఒకే వేవ్ లెంగ్త్ ని సెట్ చేయగలిగాము. ఇదే సక్సెస్ కి మూలం” అని యాత్రికులను ఫెసిలిటేట్ చేయడంలో 15 వేలమంది ఉద్యోగులు, 20 వేలమంది పోలీసులు వెయ్యమంది అధికారులు, 200 మంది ఉన్నతాధికారులు, మంత్రులతో కలసి పని చేసిన మఖ్యమంత్రి స్వయంగా చెప్పారు.
పుష్కరాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుతో 80 శాతం పనులను మీ సిటీకి శాశ్వత ఆస్ధులుగా మిగిలిపోయే పనులు చేయించుకోండి. అలా ప్లాన్ చేసుకోండి అని చాలా కాలం రాజమండ్రి కార్పొరేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. ఓటు నోటు కేసు మన సిటీని దెబ్బతీసింది. ఆయన దృష్షి ఇక్కడ లేకపోవడాన్ని నాయకులు అధికారులు కాంటా్రక్టర్లు సొమ్ముగా మార్చేసుకున్నారు. ” పేషెంటుకి స్నానం చేయించి కొత్తబట్టలు కట్టి సెంటు పులిమి కుర్చీలో కూర్చోబెట్టినట్టు రాజమండ్రిని ముస్తాబు చేశారు. కోటిలింగాల ఘాట్ కి వెళ్ళిరండి అది 14 కోట్ల రూపాయల పని నాలుగంటే నాలుగే రోజుల్లో ఎన్ని మెట్లు ఊడిపోతున్నాయో లెక్కపెట్టి రండి” అని నగర ప్రముఖుడు ఒకరు అన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన నాయకుడు. ఈ విషయం సిఎం దృష్టికి తీసుకు వెళ్తున్నారా అంటే ఫిర్యాదు చేస్తాం రాజధాని నిర్మాణం పనుల్లో తీరిక లేకుండా వున్న ఆయన ఏం చేస్తాడు ఆయన గట్టిగా అడిగితే మా నాయకులు ”అనూహ్య జనం” అనేస్తారు కదా అని ఆయన నవ్వేశాడు.