భాజపాకి దక్షిణాదిన మళ్ళీ మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలలో భాజపాతో జత కట్టేందుకు అధికార ఏ.ఐ.ఎన్.ఆర్.సీ.పార్టీ నిరాకరించింది. తమిళనాడులో జయలలిత (అన్నాడిఎంకె పార్టీ), విజయ్ కాంత్ (డిఎంకె పార్టీ) “మీ పొత్తులు మాకవసరం లేదని” మొహం మీదనే చెప్పేసారు కానీ ఏ.ఐ.ఎన్.ఆర్.సీ.పార్టీ అధినేత, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కూడా అదే ముక్కని కాస్త పద్ధతిగా తెలియజేసారు. భాజపా పొత్తుల ప్రతిపాదనకు ఆయన సమాధానం చెప్పకుండా ఊరుకొన్నారు. 2014 లోక్ సభ ఎన్నికలలో రంగస్వామి తమ పార్టీతో పొత్తులు పెట్టుకొని విజయం సాధించారు కనుక మే 16న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమతో కలిసి వస్తారనుకొంది భాజపా. కానీ ఈసారి ఆయన కూడా హ్యాండ్ ఇవ్వడంతో భాజపాకి పుదుచ్చేరిలో కూడా ఎదురీత తప్పడం లేదు.
ఇంక గత్యంతరం లేని పరిస్థితులలో పుదుచ్చేరిలో కూడా భాజపా ఒంటరి పోరాటానికి సిద్దమయింది. పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 16 స్థానాలకు భాజపా ఇవ్వాళ్ళ తన అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన 14 స్థానాలకు కూడా భాజపా అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మహేష్ గిరి చెప్పారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్, వామ పక్షాల కూటముల మధ్యనే అనేక దశాబ్దాలుగా అధికార మార్పిడి జరుగుతోంది తప్ప వేరే పార్టీకి, కూటమికి అక్కడి ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు. కనుక అక్కడ కూడా భాజపా ఒంటరి పోరాటం చేయవలసివస్తోంది. కేరళలో పెద్దగా గుర్తింపులేని ఒక స్థానిక పార్టీ భాజపాతో పొత్తులు పెట్టుకోవడానికి అంగీకరించడంతో అదే మహా ప్రసాదం అన్నట్లుగా, ఎలాగు గెలవలేని కొన్ని సీట్లలో కొన్నిటిని దానికీ పంచి ఇచ్చి ఎన్నికలకి సిద్దపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో భాజపాకి తిరుగులేకపోయినా, దక్షిణాదిన మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. వాటితో పోలిస్తే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో భాజపా పరిస్థితి కొంత నయమనుకోవలసి ఉంటుంది.