చేతిలో హిట్స్ ఉన్నంత వరకూ దర్శకుడే హీరో ! ఒక్కసారిగా ఫ్లాపులు చుట్టుముడితే అప్పటి వరకూ చుట్టూ ఉండి భజన చేసిన వాళ్లంతా విలన్‌ని చూసినట్టు చూస్తుంటారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పరిస్థితి ఇలానే ఉంది. జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలతో రెండు వరుస డిజాస్టర్లు ఎదురవ్వడంతో పూరి పై నమ్మకంతో సినిమాలు కొన్న డిస్టిబ్యూటర్లు పూరిపై కోపం తెచ్చుకొన్నారు. పూరి వల్ల తమ కుటుంబాలు నాశనమయ్యాయని గోల గోల చేస్తున్నారు. ఇదే విషయంపై పూరిని కొంతమంది బయ్యర్లు మాటి మాటికీ నిలదీస్తున్నార్ట. వరుస ఫ్లాపుల వల్ల నష్టపోయామని. ఆదుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ పూరిని ఊపిరి సలపనివ్వడం లేదని తెలుస్తోంది.
తదుపరి సినిమాల్ని తమకే తక్కువ రేటు కి అమ్మాలని హెచ్చరిస్తున్నారట. ఈ వ్యవహారంపై విసిగిపోయిన పూరి జగన్నాథ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. శనివారం సాయింత్రం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చిన పూరి కొంతమంది బయ్యర్లపై లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారట. పూరిని ఎవరెవరు బెదిరించారో ఆ లిస్టు తీసుకొని, ఆ బయ్యర్లని పిలిపించి మాట్లాడతామని హామీ ఇచ్చారట. ఏ విషయమైనా సానుకూలంగా కూర్చుని చర్చించుకొంటే మంచిది. బయ్యర్లయినా, దర్శకులైనా రోడ్డెక్కితే సున్నితమైన విషయం కాస్త కాంప్లికేటెడ్ వ్యవహారంలా తయారవుతుంది. మరి ఈ గొడవ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.