ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటిపై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల దాడి సంఘటన సినీ పరిశ్రమలో నెలకొని ఉన్న ఒక తీవ్ర సమస్యని తెరపైకి తీసుకు వచ్చి పరిష్కారం కోరుతోంది. పూరీ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మించిన ‘లోఫర్’ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చమని వారు పూరిని కోరితే ఆయన అందుకు అంగీకరించకపోవడంతో గురువారం రాత్రి వారు పూరి ఇంట్లోకి జొరబడి ఆయనపై దాడి చేసారు. ఈరోజు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వగైరాలన్నీ సాధారణ వార్తలే. ఈ సంఘటనని డిస్ట్రిబ్యూటర్ల కోణం నుంచి చూసినట్లయితే దానిలో వారి ఆవేదన కనబడుటుంది.
సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్యనే విడుదలయిన సర్దార్ గబ్బర్ సింగ్ అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. కాకపోతే ఎవరూ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం తాము చెల్లించిన డబ్బులు ఇమ్మని నిలదీసి అడుగలేదు. తన వలన సినిమా నిర్మాత నష్టపోయారు కనుక ఆయన కోసం మరో సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించేరు. కానీ డిస్ట్రిబ్యూటర్లకి వచ్చిన నష్టాన్ని ఎవరు పూడ్చుతారు?
ఇటువంటి సంఘటనలు సినీ పరిశ్రమలో ప్రస్తుత నియమ నిబంధలను మార్చవలసిన అవసరం గురించి నొక్కి చెప్పుతున్నాయి. ఒక సినిమాకి నష్టం వస్తే దానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లే బలవుతుంటారు. సినిమాని తనకు నచ్చినట్లు తీసిన దర్శకుడు, భారీ పారితోషికాలు తీసుకొనే హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకుడు, కెమేరామ్యాన్ వంటి సాంకేతిక నిపుణులు అందరూ దానితో సబంధం లేనట్లు మరో సినిమాకి వెళ్లిపోతుంటారు. అంటే తప్పు లేదా ప్రయోగం ఒకరు చేస్తే దాని చేదు ఫలితాలను వేరెవరో అనుభవించవలసి వస్తోందన్న మాట.
ఈ సమస్య సినీ పరిశ్రమ మొదలయినప్పటి నుంచి ఉంది కానీ ఇప్పుడు సినిమా నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తున్నందున లాభం వచ్చినా, నష్టం వచ్చినా అదే స్థాయిలో ఉంటుంది. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా అందులో ఏమాత్రం కొత్తదనం చూపలేక మూస కమర్షియల్ సినిమాలు తీస్తునందున ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫట్ అవుతుందో ఎవరికీ తెలియని అయోమయంలోనే సినిమాలు చుట్టబెట్టేస్తున్నారు. మళ్ళీ దీనికి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమానే ఉదాహరణగా చెప్పుకోవచ్చును.
సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అవుతున్నా హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు తదితరులు తమ పారితోషికం ఏమాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడరు. పైగా సినిమా సినిమాకి ఇంకా పెంచుకొంటూనే పోతుంటారు. సినిమా బాగా ఆడితే అది మా గొప్పదనమే అని క్లెయిం చేసుకొనే హీరోలు, దర్శకులు సినిమా ఫ్లాప్ అయితే కనిపించకుండా తప్పించుకొనిపోతారు. ఒక సినిమా విజయవంతం అయితే దాని లాభాలను, గొప్పదనాన్ని, పేరు ప్రఖ్యాతులను స్వంతం చేసుకొనేవారు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ నష్టాన్ని కూడా సమానంగా భరించడం న్యాయం. మన సినీ పరిశ్రమలో అటువంటి నియమ నిబంధనలేవీ ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే దానివలన పరిశ్రమలో పెద్దలకే ఎక్కువ నష్టం భరించవలసి వస్తుంది కనుక. ఇటువంటి సంఘటనలు సినీ పరిశ్రమలో మారుతున్న ఆలోచనా విధానానికి, పరిస్థితులకి అద్దం పడుతున్నాయని గుర్తించి, లాభానష్టాలలో అందరినీ బాధ్యులుని చేసేవిధంగా తగు నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోకపోతే ఇవి పునరావృతమవుతూనే ఉంటాయి