ఏపీలో ప్రతిపక్షం నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి పెద్ద సంఖ్యలో వలసలు వస్తున్నాయి. ఈ పరిణామాల మీద తెలుగుదేశం విపరీతంగా బలోపేతం అయిపోతుందనే సంతోషం పార్టీకి చెందిన కొందరు అగ్రనాయకుల్లో ఉండవచ్చు గాక. కానీ.. వైకాపానుంచి ఎమ్మెల్యేలతో పాటూ వారి అనుచరులు, మండల, నియోజకవర్గస్థాయి ఇతర నాయకులు ఇలా అనేక మంది వలసలు వచ్చేస్తూనే ఉన్నారు. వారందరికీ తెదేపా నాయకత్వం ఎలాంటి న్యాయం చేస్తుంది అనేది ఆ పార్టీలో ఉత్కంఠభరితమైన చర్చగా సాగుతోంది.
చంద్రబాబునాయుడేమో ఇప్పటిదాకా నామినేటెడ్ పదవులను కూడా పార్టీని నమ్ముకున్న జెండాను మోసిన కార్యకర్తలకు పదవులు పంచకుండా రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు.కార్యకర్తల్లో నామినేటెడ్ పదవులకోసం నిరీక్షణ పర్వం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పెరుగుతున్న వలసలు ఈ పదవుల ఆశావహుల్లో కొత్త భయాలు రేకెత్తిస్తున్నాయి.
వైకాపాను ఎంత దారుణంగా దెబ్బ కొట్టాలని చంద్రబాబునాయుడు అనుకున్నప్పటికీ.. ఆ పార్టీనుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే సరిపోతుంది కదా.. ఇతర నాయకులనందరినీ ఇప్పటినుంచి చేర్చుకోవడం ఎందుకు? అనే మాట వినిపిస్తోంది. కొత్తగా వస్తున్న నాయకులు నామినేటెడ్ పదవులకు కూడా పోటీ పడతారేమో అనే భయం వారిలో పెరుగుతోంది. వలసనేతలకు టికెట్ గ్యారంటీ మాత్రమే ఇవ్వాలని, నామినేటెడ్ పదవులు ఇవ్వరాదని పార్టీ నాయకులు పార్టీ పెద్దలను కోరుతున్నారంటే వారిలో భయాలు ఏ రేంజిలో చెలరేగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.