ఆంధ్రప్రదేశ్ కేడర్ లో పనిచేస్తున్న దాదాపు 20 మంది ఆల్ ఇండియా సర్వీసుల అధికారులు తమను సెంట్రల్ సర్వీసుల్లోకి తీసుకోవాలని / ఇతర రాష్ట్రాలకు / సొంత రాష్ట్రాలకు డిప్యుటేషన్ పై పంపాలని అప్లయ్ చేసుకున్నారు. ఇది ఐఎఎస్, ఐపిఎస్ మొదలైన అఖిలభారత సర్వీసుల్లో వున్నవారి సదుపాయం…అవకాశం…హక్కు. దాన్ని వినియోగించుకోవడం అసాధారణం కాదు. కానీ, ఒకేసారి 20 మంది ఎపిని వొదిలిపోవాలనుకోవడమే ఆశ్చర్యకరం.
మంత్రుల కొడుకులతో సహా సిఎం కార్యాలయం మొదలు జన్మభూమి కమిటీ సభ్యుల వరకూ ”పనులు – పైరవీల”తో సతాయిండం ఇందుకు ఒక కారణమైతే , సీనియారీటీని, సమర్ధతను పక్కన పెట్టి “ఎస్ బాస్ ” అనే అధికారులకే కీలక పోస్టింగులు ఇస్తున్నారన్నది ముఖ్యకారణంగా చెబుతున్నారు.
ఇప్పటికే అదనపు డిజిపి స్థాయి ఐపిఎస్ అధికారి విఎస్కె కౌముది సర్కారుపై అసంతృప్తితో దరఖాస్తు పెట్టుకొని మరీ ఇటీవల కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆయన సిఆర్‌పిఎఫ్‌లో పోస్టింగ్ అడగ్గా, ట్రాక్ రికార్డును గమనించిన కేంద్రం ఉగ్రవాద చర్యలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసే ప్రసిద్ధ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)లో కీలక స్థానం ఇచ్చి గౌరవిం చిందని ఐపిఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన సేవలపై ఎపి ప్రభుత్వాధినేతలకు పెద్దగా ఆసక్తిలేదని కౌముది భావించడమే ఆయన ఢిల్లీ వెళ్ళిపోడానికి మూలం. కేంద్రప్రభుత్వం కౌముది ఇచ్చిన పోస్టింగ్ ను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయన సామర్ధ్యాన్ని గుర్తించలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఉత్తరకోస్తాలో ఒక సీనియర్ పోలీస్ అధికారిపై ఒక మంత్రి తమ వారికి పనులపై ఇబ్బంది పెడుతుండటంతో మరోచోటుకి బదిలీ చేయాలని ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు.
ఫలితాలపై కంటే ప్రచార లక్ష్యంతో ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహిస్తున్న వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాల బాధలు తట్టుకోలేక ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాల నుంచి సబ్ కలెక్టర్ స్థాయి వరకు ఐఎఎస్‌లు, అదనపు డిజిపిల నుంచి ఎస్పీల వరకు ఐపిఎస్‌లు విసిగెత్తుపోతున్నారని వారికి సహాయంగా వుండే చిన్న ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు.
ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటారు. ఆ పరిమితిని దాదాపు మూడింతలు అధిక సంఖ్యలో ఒకేసారి రాష్ట్రం వొదలిపోవాలనుకోవడం సాధారణ విషయం కాదు.
ఇది అధికారుల పట్ల ప్రభుత్వ విధానాల్ని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించకోవలసిన సందర్భం!