ముద్రగడ పద్మనాభం చాలా సీనియర్ నాయకుడు. కాపు ఉద్యమం పట్ల ఆయన చిత్తశుద్ధికి ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ ఉంది. తాను నాయకుడిగా ఉండే రోజుల్లో కూడా ఆయన పాటించిన విలువలు, పాటించిన నిజాయితీ గురించి కూడా కేవలం ఒక కులానికి పరిమితం కాకుండా ప్రజలందరిలో కూడా ఒక క్రెడిబిలిటీ ఉంది. అయితే ఆయన ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కాపుల విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి మాట్లాడుతున్న మాటలు మాత్రం అవగాహన లేని వారు చెబుతున్న సంగతుల్లా ఉంటున్నాయి. మరీ ఆవేశపరులైన కుర్రకారు చెబుతున్నట్లుగా.. ముద్రగడ మాటలు చెప్పడం ఆయన లక్ష్యం సాధించడానికే అడ్డంకులు అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
తాజాగా ముద్రగడ మాట్లాడుతూ కాపుల సమస్యల పరిష్కారానికి, తన జాతికోసం తాను ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధం అంటూ ప్రకటించారు. ఈ దేశంలో ఎలాంటి సమస్యకు అయినా సరే, ఒకరి ఆత్మహత్య అనేది పరిష్కారం అయ్యేట్లయితే గనుక.. దేశంలో ఎప్పటికీ సమస్యలే మిగిలి ఉండేవి కాదు. ఒక సమస్య పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకునే తెగువ ఒక్క ముద్రగడకు మాత్రమే మాత్రమే.. కాదు. సమస్యల్ని ఎదిరించలేక పారిపోయే చాలా మందికి అదే ఉద్దేశం ఉంటుంది. జాతికోసం ఏమైనా చేయాలనుకుంటున్న ముద్రగడ ఆత్మహత్య కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంటుందని ఆలోచించాలి.
ఆయన తనకున్న చైతన్యాన్ని నలుగురికీ ఇవ్వాలనే ధోరణిలో ఆలోచించాలి గానీ.. తాను ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందనుకుంటే భ్రమ. అసలు ఉద్యమమే లేకుండా ప్రభుత్వాలు దానిని తొక్కేసినా ఆశ్చర్యం లేదు. జాతికోసం అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా వంటి మాటలు కూడా సరికాదు. రాజకీయ చైతన్యం ద్వారానే జాతికోసం ఏదైనా సాధించడం సాధ్యం అయినప్పుడు.. సాధించగలుగుతున్నాం అని నమ్ముతున్నప్పుడు.. మధ్యలో నైరాశ్యంతో ఇలాంటి మాటలు మాట్లాడడం ముద్రగడ వంటి పెద్దలకు కరెక్టు కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఆయన తన మాటల్లో నైరాశ్యం రానివ్వ రాదని, నిత్యం పోరాటస్ఫూర్తితోనే ఉండాలని ఆయన జాతి కోరుకుంటున్నదని ఆయన గుర్తించాలి.