కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వారికి కొత్త చిక్కులు కూడా వచ్చి పడుతున్నాయి. ఇవేమి వారు ఊహించని కష్టాలు కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. టీ కాంగ్రెస్ లో మిగిలి ఉన్న నాయకులూ ఎవరూ మిస్ కాకుండా.. అందరికీ పదవులు పంచేస్తూ పార్టీ కార్యవర్గం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిమీద కూడా అసంతృప్తులు రేగుతున్నాయి. ఇన్నాళ్ళుగా పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన వకులాభారణం రామకృష్ణ ఇప్పుడు రాజీనామా చేసారు. అయన తెలంగాణ కు సంబంధించినంత వరకు ప్రముఖ బీసీ నాయకుడు కూడా కావడం వల్ల ఈ రాజీనామా తో ఎంతో కొంత నష్టం ఉంటుందని భావించవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే వకులాభారణం రామకృష్ణ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేలా పార్టీ వాళ్ళే పొగ పెట్టారని చెప్పాల్సి ఉంటుంది. బీసీ వర్గానికి అనుకూల నిర్ణయం తీసుకున్నందుకు అయన కెసిఆర్ ను అభినందించిన సంగతి తెలిసిందే. ఆ మాత్రం దానికి టీపీసీసీ నాయకులకు ఆగ్రహం ఉప్పొంగి, ఆయనకు షో కాజ్ నోటీసులు ఇచ్చారు. అయన వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంత జంబో కార్యవర్గం ప్రకటించి ఆయనకు చోటు లేకుండా చేసారు. ఈ పరిణామాలపై కలత చెందినా వకులాభరణం.. పార్టీని మొత్తం అసమర్థులతో నింపేసారని, అందువల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం విశేషం.
టీపీసీసీ నాయకులు తమ వ్యక్తిగత రగద్వేషాలకు అనుకూలంగా అధిష్టానం కు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చి, కిట్టని నాయకుల్ని బయటకు పంపేలా కుట్రలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తమ పతనాన్ని తామే నిర్దేశించుకునే ఇలాంటి చర్యలు గనుక కాంగ్రెస్ లోకల్ నాయకులూ మనుకోకుంటే… ముందు ముందు మరింత ఇబ్బంది అని పలువురు సూచిస్తున్నారు. వకులాభరణం విషయానికి వచ్చినా.. ఆయన పార్టీ నుంచి వెళ్ళేవరకు వీరు పొగ పెట్టారని, కానీ, దీనివల్ల అయన కోల్పోయేది ఏమి ఉండదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.