రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి వైకాపా తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి మూడు తెదేపాకి ఒకటి వైకాపాకి దక్కాలి. కానీ, వైకాపా ఎమ్మెల్యేలు తెదేపా పార్టీ ఫిరాయిస్తుండటంతో వైకాపా బలం చాలా వేగంగా తగ్గిపోతోంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపాకి ఆ ఒక్క సీటు కూడా దక్కనీయమని తెదేపా నేతలు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు కనుక జూన్ లో జరిగే రాజ్యసభ ఎన్నికలలోగానే వైకాపాను వీడదలుచుకొన్నవారందరూ బయటకు వెళ్లిపోవచ్చునని వైకాపా అధిష్టానం కూడా మానసికంగా సిద్దమయిపోయినట్లుంది.
అందుకే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి గౌరవం పోగొట్టుకోవడం కంటే, పోటీ చేయకుండా ఉండిపోతే కనీసం ప్రజల సానుభూతి అయినా దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డిని రాజ్యసభకు పంపించాలనుకొంది కానీ పార్టీలో వేగంగా మారిపోతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం ఉన్నట్లు కనబడటం లేదు.
ఒకవేళ విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లు ఇప్పుడే ప్రకటించినట్లయితే, పార్టీ నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోతున్నట్లు వైకాపా స్వయంగా అంగీకరించినట్లే అవుతుంది. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలపై ఆ ప్రభావం పడితే అదింకా ప్రమాదం. కనుక మరికొన్ని రోజులు వేచి చూసి పార్టీ పరిస్థితిని బట్టి విజయ సాయి రెడ్డిని రాజ్యసభ ఎన్నికల బరిలో నిలపాలా వద్దా అనే దానిపై జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత విజయ సాయి రెడ్డికే అప్పగించడం గమనార్హం. అంటే రాజ్యసభకి వెళ్ళాలనుకొంటే ఎమ్మెల్యేలను పార్టీ వీడకుండా కాపాడుకోవలసిన బాధ్యత మీదేనని సూచిస్తున్నట్లుంది. అయితే ఆయన బుజ్జగింపులు కూడా పనిచేయడం లేదు.
ఒకవేళ ఆయనకి ఆ అవకాశం లేకపోయినట్లయితే, ఆ ఆసక్తి ఉన్న ఎవరయినా ప్రముఖులను పోటీకి ప్రోత్సహించి వారికి మద్దతు తెలపాలని వైకాపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెదేపా కూడా ఔనని, కాదనలేని అభ్యర్ధిని ముందుకు తెచ్చినట్లయితే దానికీ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించగలదు.