కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు డొంక తిరుగుడు, దాపరికం డైలాగులు మాట్లాడడం ఇప్పటికీ మార్చుకోలేదు. అన్ని అంశాల్లోనూ సగం సగం పరిణామాలు బయటకు చెప్పి జనాన్ని మభ్యపెడుతూ ఉండవచ్చుననే అయన వైఖరి ఏ మాత్రం మారలేదు. తాజాగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితుడయిన లక్ష్మణ్ తనను కలిసినప్పుడు అయన చర్చించిన సంగతులు కూడా ఇందుకు నిదర్శనం గానే ఉన్నాయి.
ప్రధానంగా 2 అంశాల్లో సస్పెన్స్ ను కొనసాగించడం ద్వారా తాము లాభం పొందాలని వెంకయ్య ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 1) అసెంబ్లీ సీట్ ల పెంపకం 2) విభజన చట్టం లోని లోపాలు. కానీ ట్రాజెడీ ఏమిటి అంటే.. ఈ రెండు అంశాల్లో కూడా అయన ఏ సంగతి స్పష్టంగా చెప్పడం లేదు.
1) అసెంబ్లీ సీట్ ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఆశావహులు దీనిని నమ్ముకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కేంద్ర న్యాయశాఖ వద్ద ఫైల్ ఉందని అంటున్న.. వెంకయ్య ఫైల్ లో ఏముంది. హోమ్ శాఖ ఎలాంటి సిఫారాసులతో ఆ ఫైల్ ను న్యాయ శాఖ వద్దకు పంపింది.. ఎన్నికల సంఘం స్పందన ఎలా ఉన్నది అనే మర్మం చెప్పడం లేదు. బడ్జెట్ సమావేశాలు తిరిగి మొదలు కాగానే ఈ బిల్లు సభకు వస్తుందని గతంలో అన్న వెంకయ్య ఇప్పుడు ఆ మాటెత్తడం లేదు. కనీసం ఎప్పటి లోగ న్యాయశాఖ క్లియర్ చేస్తుందనే ఆలోచన కూడా చెప్పడం లేదు. జనాన్ని అలా ఆశల్లో బతికేలా చేయడమే అయన వ్యూహంగా ఉంది.
2) విభజన చట్టంలో లోపాల మీద కూడా మోడీ సర్కార్ శ్రద్ధ పెట్టినట్లు వెంకయ్య చెబుతున్నారు. విభజన చట్టంలో లోపాలు ఉన్నాయనే సంగతి, ఆ బిల్ ఆమోదం పొందక ముందునుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన మేధావులు చెబుతూనే ఉన్నారు. మరి ఇన్నాళ్లు కేంద్రం ఏమి చేస్తున్నట్లు? ఇదొక ఘోరం అయితే.. అసలు మోడీ సర్కార్ గుర్తించిన లోపాలు ఏమిటి, వాటిని ఎలా సరిదిద్దడానికి కేంద్రం ఏమి చర్యలు ఆలోచిస్తున్నది.. అనే సంగతిని కూడా వెంకయ్య దాచి పెడుతున్నారు. ఈ వైఖరి కేంద్రం చిత్తశుద్ధి మీద అనేక అనుమానాలు కలిగిస్తున్నది.
తను ప్రజల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఉండదని, తనను ప్రజలు నమ్మవలసిన అవసరం ఎప్పటికి లేదని వెంకయ్యకు ఒక ధీమా ఉండవచ్చు గాక, కానీ తన మీద జనానికి నమ్మకం పోతే భవిష్యత్తు మొత్తం చీకటి అవుతుందని, పార్టీలోను విలువ తగ్గుతుందని అయన తెలుసుకోవాలి.