కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఖమ్మం జిల్లాలో పాలేరు శాసనసభ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. దాని కోసం తెరాసలో అంతర్గతంగా పోటీ నెలకొని ఉండటం సహజమే. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన కుమారుడు యుగంధర్ ని ఈ ఎన్నికలలో పోటీ చేయించి ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకురావాలనుకొంటున్నారు. తుమ్మల నాగేశ్వర రావుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యక్తి తెరాస ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. ఆయనకి కూడా జిల్లా రాజకీయాలపై, పార్టీపై కూడా మంచి పట్టు ఉంది. ఈ ఉపఎన్నికలలో తను సూచించిన అభ్యర్ధికే పార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
తెదేపా నుంచి వచ్చి తుమ్మలకి పార్టీలో చేరగానే మంత్రి పదవి ఇచ్చేరు కనుక ఇప్పుడు ఆయన కొడుకుకి కూడా టికెట్ ఇవ్వనవసరం లేదని, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తికే టికెట్ ఇవ్వాలని జలగం వాదిస్తున్నారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ఆయన వాదనని సమర్ధిస్తున్నారు. అయినా తుమ్మల తన ప్రయత్నాలు విరమించుకోలేదు. కేసీఆర్ కి సన్నిహితుల ద్వారా తన కొడుకుకి టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఒకప్పుడు ఖమ్మంలో తెరాస చాలా బలహీనంగా ఉండేది. తుమ్మలని పార్టీలోకి తీసుకొన్న తరువాత ఖమ్మంలో బలపడింది. నేటికీ ఆయన జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే జలగం కూడా యధాశక్తిన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తునే ఉన్నారు. ఆయన తన బంధువుల కోసమో లేక స్నేహితుల కోసమో పార్టీ టికెట్ అడగడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని టికెట్ ఇచ్చి గౌరవించమని కోరుతున్నారు. కనుక వారిద్దరిలో ఎవరినీ కాదనలేని పరిస్థితి. టికెట్ కోసం వీరిద్దరే కాకుండా పార్టీలో చాలా మంది నేతలు ఒత్తిడి చేస్తున్నారు.
తెరాసలో అంతర్గతంగా ఇంత పోటీ నెలకొని ఉంటే, వైకాపా నుంచి కూడా కాదనలేని మంచి ఆఫర్ వచ్చింది. ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ ఆఫర్ ఇస్తున్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే తనతో సహా చాలా మంది వైకాపా నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరిపోతామని, తమ పార్టీని తెరాసలో విలీనం చేస్తామని ఆఫర్ ఇస్తున్నారు. తెలంగాణాలో వైకాపా నామమాత్రంగానే ఉన్నప్పటికీ, శత్రుశేషం ఉండకూడదని కేసీఆర్ భావిస్తే ఈ ఆఫర్ ని తిరస్కరించడం కష్టమే. కనుక ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేవారికి ప్రాధాన్యతనివ్వాలా లేకపోతే చిరకాలంగా పార్టీకి సేవ చేస్తున్న వారికివ్వలా లేదా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో వైకాపాని శాస్వితంగా అడ్డు తొలగించుకోవాలా అనే సందిగ్ధం నెలకొని ఉన్నట్లు కనబడుతోంది.