ఎండలకు తెలుగు రాష్ట్ర్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఆ ప్రభావం సినీ రంగంపై కూడా పడుతోంది. సూర్య భగవానుడి తాకిడి వల్ల బాహుబలి టీమ్.. ఏకంగా నెల రోజులు షూటింగ్‌ని క్యాన్సిల్ చేసుకొంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా సెలవలు తీసుకొంటున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని అనుకొన్న సమయంలో విడుదల చేయడానికి చిత్రబృందం విపరీతంగా కష్టపడింది. ఆఖరి పదిహేను రోజులూ… టీమ్‌లో ఒక్కరూ నిద్రపోలేదట. ఆఖరికి పవన్ కల్యాణ్ కూడా రికార్డింగ్ థియేటర్ దగ్గరకే మకాం పెట్టేశాడు. ఆ అలసటకు తోడు ఇప్పుడు ఎండలు పెరిగిపోయాయి. అందుకే… పవన్ కాస్త గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడట.
ముందు అనుకొన్న షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల చివరి వారంలో ఎస్.జె. సూర్య సినిమా పట్టాలెక్కించేయాలి. అయితే.. ఎండలు పెరిగిపోవడంతో షూటింగ్‌ని కనీసం ఓ వారం పాటు వాయిదా వేద్దామని పవన్ డిసైడ్ అయ్యాడట. ఈలోగా పుణె వెళ్లి.. అక్కడ పదిరోజుల పాటు పిల్లలతో గడిపిరావాలని పవన్ భావిస్తున్నాడు. రేపో.. మాపో పవన్ పుణె వెళ్లిపోవొచ్చు. ఈనెలాఖరున మళ్లీ తిరిగొస్తాడట. వచ్చాక.. సూర్య సినిమా పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.